Maharashtra: పరీక్ష రాయకుండా తప్పించుకునేందుకు.. స్టూడెంట్ కు పురుగుల మందు ఇచ్చిన టీచర్

  • పదో తరగతి చదువుతున్న బాలిక మృతి
  • మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఘటన
  • ఆమె అడిగినందుకే ఇచ్చానన్న టీచర్.. అరెస్ట్ చేసిన పోలీసులు
Teacher arrested for giving pesticide to Class 10 student to assist her skip board exam

పరీక్షకు సరిగా చదవలేదని, దానిని తప్పించుకునేందుకు మార్గం చెప్పాలన్న పదో తరగతి విద్యార్థినికి ఓ టీచర్ పురుగుల మందు ఇచ్చాడు. పరీక్షకు టెన్షన్ పడొద్దని ధైర్యం చెప్పడం మానేసి.. కొంత పురుగుల మందు తాగితే ఆస్పత్రిలో చేర్చుతారని, పరీక్ష తప్పించుకోవచ్చని చెప్పాడు. అది తాగిన విద్యార్థిని ప్రాణాలు పోగొట్టుకుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా శిర్తి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ఏం జరిగింది?

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా శిర్తికి చెందిన సనికా మాలి అనే అమ్మాయి ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. గత నెలలో ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆమె పరీక్ష కోసం ఏమాత్రం సిద్ధం కాలేదు. దీంతో ఆందోళనకు గురైంది. పరీక్ష నుంచి తప్పించుకునే మార్గం చెప్పాలంటూ నీలేశ్ బాలు అనే టీచర్ వద్దకు వెళ్లింది. అలా తప్పించుకోవడం తప్పని చెప్పాల్సిన టీచర్.. ఆమె ఆలోచనను సపోర్ట్ చేశాడు. తన దగ్గర ఉన్న పురుగుల మందును ఆమెకు ఇచ్చి, తాగాలని చెప్పాడు.

నీళ్లలో కలుపుకొని తాగి..

అమ్మాయి తనకు టీచర్ ఇచ్చిన పురుగుల మందును నీళ్లలో కలుపుకొని తాగి స్కూల్ కు వెళ్లింది. అప్పటికే ఆమె అస్వస్థతకు గురైంది. తనకు ఒంట్లో బాగోలేదని, పరీక్ష రాయలేనని టీచర్లకు చెప్పింది. ఆమె పరిస్థితిని గమనించిన టీచర్లు వెంటనే కొల్హాపూర్ లోని ఓ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ కొన్ని రోజులు చికిత్స పొందిన అమ్మాయి ప్రాణాలు వదిలేసింది.

పోలీసులు అనుమానంతో ప్రశ్నించడంతో..

సనికా మాలి మృతిపై అనుమానం వచ్చిన పోలీసులు వచ్చి స్కూల్ టీచర్లు, స్టాఫ్, విద్యార్థులను విచారించారు. ఈ సమయంలో కొందరు విద్యార్థులు నీలేశ్ మీద అనుమానం వ్యక్తం చేయడంతో అతడిని అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించారు. చివరికి తానే పురుగుల మందు ఇచ్చినట్టు అతను ఒప్పుకున్నాడు. అమ్మాయి తనపై ఒత్తిడి తెచ్చి అడిగినందువల్లే పురుగుల మందు ఇచ్చానని చెప్పాడు. పోలీసులు అతడిపై ఐపీసీ 328, 204 సెక్షన్ల కింద కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News