Corona Virus: ఇటలీలో ఇద్దరు అమెజాన్​ ఉద్యోగులకు కరోనా.. అమెరికాలో వైరస్​ తో రెండో మృతి

  • తగిన సహాయం అందిస్తున్నట్టు ప్రకటించిన అమెజాన్ సంస్థ
  • కరోనా ఎఫెక్ట్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఇంటర్వ్యూలు
  • న్యూయార్క్ కూ విస్తరించిన వైరస్
Two Amazon employees in italy contracted with coronavirus

కరోనా వైరస్ రోజురోజుకు మరింతగా విస్తరిస్తోంది. ఇటలీలోని మిలన్ లో ఉన్న తమ కంపెనీ బ్రాంచ్ లో ఇద్దరు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్టుగా అమెజాన్ సంస్థ ప్రకటించింది. వారిని ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్ కు తరలించినట్టు తెలిపింది. ‘‘కరోనా వైరస్ బారిన పడిన ఉద్యోగులకు తగిన సహాయం అందజేస్తున్నాం. వారు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు” అని అమెరికాలో అమెజాన్ కంపెనీ ప్రతినిధి డాన్ పెర్లెట్ ప్రకటించారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూలు

అమెజాన్ కంపెనీ పలు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో కొంత కాలం పాటు వీలైనంత మేర అన్ని రకాల ఇంటర్వ్యూలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది.

అమెరికాలో రెండో వైరస్ మృతి

కరోనా వైరస్ కారణంగా అమెరికా భూభాగంపై మరో మరణం నమోదైంది. ఒక 70 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మృతి చెందినట్టు వాషింగ్టన్ లోని కింగ్ కంట్రీ హెల్త్ ఆఫీసు ప్రకటించింది. ఇదే ప్రాంతంలో ఇంతకుముందే 50 ఏళ్ల వ్యక్తి ఒకరు వైరస్ తో చనిపోయారు. ఇక అమెరికాలోని న్యూయార్క్ లో ఆదివారం తొలి కరోనా వైరస్ కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు.

More Telugu News