Uttar Pradesh: భర్త కొత్త బట్టలు కొనివ్వలేదని ఆరు నెలల బిడ్డను కొట్టి చంపిన భార్య

  • ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ లో దారుణం
  • హోలీకి కొత్త డ్రెస్సుల కోసం పట్టుబట్టిన భార్య
  • భర్త కాదనడంతో ఆవేశంతో బిడ్డను కొట్టిన మహిళ
UP Woman Allegedly Beats Her Baby To Death After Fight Over New Clothes

ఓ మహిళ క్షణికావేశం ఆరు నెలల చిన్నారిని బలి తీసుకుంది. హోలీ పండుగకు కొత్త బట్టలు కొనివ్వమని ఆమె భర్తను అడిగింది. తాను కొనిపెట్టలేనని చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఆ కోపంతో ఆరు నెలల బిడ్డను ఇష్టమొచ్చినట్టుగా కొట్టింది. అభంశుభం ఎరుగని చిన్నారి ఆ దెబ్బలను తట్టుకోలేక కన్నుమూసింది. ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాలో జరిగింది.

నాలుగేళ్ల కిందటే పెళ్లయింది

అలీగఢ్ ప్రాంతానికి చెందిన రాహుల్, పింకీ శర్మలకు నాలుగేళ్ల కిందటే పెళ్లయింది. వారికి మూడేళ్ల అబ్బాయి, ఆరు నెలల పాప ఉన్నారు. వారిది పేద కుటుంబం. రాహుల్ ఇక్కడి ఓ తాళాల ఫ్యాక్టరీలో కూలిగా పనిచేస్తున్నాడు. హోలీ సందర్భంగా తనకు, పిల్లలకు కొత్త బట్టలు కొనివ్వాలని పింకీ శర్మ ఆదివారం రాహుల్ ను అడిగింది.

అయితే, తాను కొనివ్వలేనని భర్త చెప్పాడు. దీంతో ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. బాగా ఆగ్రహంగా ఉన్న పింకీ శర్మ ఆ కోపాన్ని బిడ్డ సోనిపై చూపెట్టింది. ఇష్టమొచ్చినట్టుగా కొట్టింది. దీంతో ఆ పాప స్పృహ తప్పిపడిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లే సరికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు.

చంపాలని అనుకోలేదు

తన భార్య గొడవలో కోపంతోనే సోనిని కొట్టిందని, ఆమెను చంపాలనుకోలేదని రాహుల్ చెప్పాడు. ఆవేశంలోనే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పింకీ శర్మను అరెస్టు చేశారు.

More Telugu News