Hyderabad: ఐస్ క్రీం తింటే రక్తం కారింది...హడలిపోయిన కుటుంబ సభ్యులు!

  • నోట్లో వేసుకున్న కొద్ది సేపటికే నాలుక నుంచి రక్తం 
  • అందరిదీ అదే పరిస్థితి కావడంతో అయోమయం 
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
polluted ice cream makes problem

మండుటెండలో చల్లని ఐస్ క్రీం గొంతులో పడితే కాస్త సేదదీరినట్టు అనిపిస్తుందనుకున్న ఆ కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది. ఐస్ క్రీం తిన్న కాసేపటికే నోటి నుంచి రక్తం కారడంతో హడలిపోయారు. చూస్తే అందరి నాలుకలు పగిలి రక్తమోడుతుండడంతో ఆశ్చర్యపోవడం వారి వంతయింది. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ పాతబస్తీలోని ఒవైసీ నగరానికి చెందిన ఫయాస్ ఆలీఖాన్ కుటుంబ సభ్యులు రోడ్డుపై తోపుడు బండి వద్ద ఐస్ క్రీం కొని తిన్నారు. కాసేపటి తర్వాత నాలుకపై పగుళ్లు ఏర్పడి రక్తం కారుతుండడంతో కంగారుపడ్డారు. పోనీ ఎవరికో ఒకరికి అలా జరిగి ఉంటే నాలుకపై ఏదో సమస్య అనుకునే వారు. అందరి పరిస్థితి ఒకేలా ఉండడంతో ఐస్ క్రీంలో ఏదో కల్తీ జరిగిందని, అందుకే ఇలా జరిగిందని భావించి వెంటనే సంతోష్ నగర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

అయితే పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని, వెంటనే బండి వద్ద నుంచి ఐస్ క్రీంలు స్వాధీనం చేసుకుని తనిఖీకి పంపించి ఉంటే వాస్తవం తెలిసేదని బాధిత కుటుంబం వాపోయింది. కాగా, పాతనగరంలో తోపుడు బళ్లపై ఐస్ క్రీంల వ్యాపారం బాగా సాగుతుంది.

రాత్రింబవళ్లు అన్న తేడా లేకుండా సాగే వ్యాపారంలో కల్తీ సరుకు అమ్మకం జోరుగా సాగుతోందని స్థానికులు ఎప్పటి నుంచో విమర్శిస్తున్నారు. కానీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడివున్న ఇటువంటి అంశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని పలువురు విమర్శిస్తున్నారు.

More Telugu News