Chiranjeevi: ఇది ప్రీరిలీజ్ ఈవెంట్ లాగా లేదు... నా సన్మాన సభలా ఉంది: చిరంజీవి

  • హైదరాబాద్ లో ఓ పిట్టకథ ప్రీరిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి
  • యువ నటులను ఆశీర్వదించేందుకు వచ్చానని వెల్లడి
Chiranjeevi attends O Pitta Katha pre release event

మెగాస్టార్ చిరంజీవి 'ఓ పిట్టకథ' ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  సభకు విచ్చేసిన వారు తన గురించి మాట్లాడిన విధానం చూస్తే ఇది ప్రీరిలీజ్ ఈవెంట్ లాగా లేదని, ఓ సన్మాన సభలా ఉందని చమత్కరించారు. వాస్తవానికి తాను తన జీవితకథ ఆధారంగా రాసిన మెగాస్టార్ ది లెజెండ్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉందని తెలిపారు. అయితే, తనపై రాసిన పుస్తకం ఆవిష్కరించడానికి వెళ్లడానికి బదులు ఇక్కడికి వచ్చి ఈ చిన్నారులను ఆశీర్వదించడం మంచిదని భావించానని వెల్లడించారు.

తాను రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ చిత్రపరిశ్రమలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. ఆ పదేళ్ల కాలంలో సినీ పరిశ్రమ మారిపోయిందని, కొందరు అసిస్టెంట్ డైరెక్టర్ల జీవితం నటీనటుల కారవాన్ వద్దే గడిచిపోతుండడం బాధ కలిగిస్తోందని అన్నారు. కారవాన్ లో విశ్రాంతి తీసుకునే నటీనటుల సేవ తప్ప అసిస్టెంట్ డైరెక్టర్లు నేర్చుకునేదేమీ ఉండడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా చిత్రీకరణ కూడా ఆలస్యం అవుతుంటుందని అభిప్రాయపడ్డారు. చిన్నా పెద్ద నటీనటులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సెట్స్ మీదే అందరికీ అందుబాటులో ఉండాలని, కారవాన్ సంస్కృతిని తగ్గించాలని అన్నారు. తద్వారా నిర్మాతకు ఎంతో మేలు చేసినవారవుతారని పేర్కొన్నారు.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో చందు దర్శకత్వంలో తెరకెక్నిన ఈ చిత్రంలో విశ్వంత్, సంజయ్ రావు( నటుడు బ్రహ్మాజీ తనయుడు), నిత్యాశెట్టి నటించారు. ఈ సినిమా మార్చి 6న రిలీజ్ కానుంది.

More Telugu News