దక్షిణ కొరియాలో చెలరేగిపోతున్న కరోనా వైరస్

29-02-2020 Sat 09:45
  • నిన్న ఒక్క రోజే 594 కొత్త కేసుల నమోదు
  • మొత్తంగా కోవిడ్ బారిన 2,931 మంది 
  • అప్రమత్తమైన నార్త్ కొరియా.. ఆదేశాలు జారీ చేసిన కిమ్
Covid 19 cases rising in South Korea

కరోనా వైరస్ (కోవిడ్-19) ఇప్పుడు దక్షిణ కొరియాను వణికిస్తోంది. చైనాలో కొత్త కేసులు క్రమంగా తగ్గుతుండగా, ఇప్పుడీ వైరస్ సౌత్ కొరియాను భయపెడుతోంది. శుక్రవారం ఒక్క రోజే ఆ దేశంలో కొత్తగా 594 మందికి సోకింది. ఫలితంగా ఆ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 2,931 మందికి చేరింది. తాజాగా, మరో ముగ్గురు మహిళలు ఈ వైరస్ కారణంగా మరణించడంతో మృతుల సంఖ్య 16కు పెరిగింది. మరోవైపు చైనాలో నిన్న 47 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోగా అందులో 45 మంది ఒక్క హుబెయ్ ప్రావిన్స్‌కు చెందినవారే కావడం గమనార్హం. కొత్తగా మరో 427 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలోని బాధితుల సంఖ్య 79,251 మందికి చేరింది.

దక్షిణ కొరియాను కోవిడ్ వణికిస్తుండడంతో పక్కనే ఉన్న ఉత్తరకొరియా అప్రమత్తమైంది. వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆ దేశ సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ అధికారులను ఆదేశించారు. అంతేకాదు, ఈ విషయంలో విఫలమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వైరస్ దేశంలోకి వచ్చే అవకాశం ఉన్న అన్ని మార్గాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఉత్తరకొరియాలో ఇప్పటి వరకు ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు.