Prithvi Shaw: రెండో టెస్టుకు ముందు భారత్​కు ఎదురుదెబ్బ.. పృథ్వీ షాకు గాయం!

  • షా ఎడమ పాదంలో వాపు 
  • ప్రాక్టీస్‌ సెషన్‌కు దూరమైన యువ ఓపెనర్‌‌
  • రెండో టెస్టులో ఆడేది అనుమానమే!
Prithvi Shaw skips practice with swollen foot

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో చిత్తుగా ఓడిపోయి డీలా పడ్డ భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడినట్టు తెలుస్తోంది. ఎడమ పాదంలో వాపు రావడంతో పృథ్వీ గురువారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌కు దూరమయ్యాడు. దాంతో రెండో టెస్టుకు ముందే కోహ్లీసేన ఇబ్బందుల్లో పడనుంది. వాపు ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు పృథ్వీకి రక్త పరీక్ష నిర్వహిస్తారు.

మెడికల్ రిపోర్టు అనుకూలంగా వస్తే.. అతను రెండో టెస్టులో పాల్గొంటాడో లేదో శుక్రవారం జరిగే ప్రాక్టీస్‌ సెషన్ తర్వాత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ప్రాక్టీస్‌లో ఇబ్బందిపడితే మాత్రం శనివారం మొదలయ్యే మ్యాచ్‌కు అతను దూరం కానున్నాడు. అదే జరిగితే షా స్థానంలో మరో యువ క్రికెటర్‌‌ శుభ్‌మన్‌ గిల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

గురువారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో మెరుగ్గా కనిపించిన గిల్‌.. రెండో టెస్టులో మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చేయొచ్చు. నెట్స్‌లో గిల్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ను హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి దగ్గరుండి పర్యవేక్షించడం గమనార్హం. ఫుట్‌వర్క్‌ విషయంలో గిల్‌కు టెక్నికల్‌ సలహాలు ఇచ్చిన శాస్త్రి.. డ్రైవ్స్‌ గురించి కూడా కొన్ని చిట్కాలు చెప్పాడు.

More Telugu News