కరోనా ప్రభావిత దేశాల వారికి మక్కా ప్రవేశం లేదు: సౌదీఅరేబియా

27-02-2020 Thu 12:25
  • బాధిత దేశాల పౌరులకు వీసాల జారీ నిలిపివేత
  • ఈ నిషేధం ఎప్పటి వరకన్నది వెల్లడించని అధికారులు
  • ఏ దేశాల వారిని అనుమతించరన్న విషయంపైనా రాని స్పష్టత
No visa for covid 19 effected countries people

మక్కా యాత్ర చేయాలనుకున్న వారికి సౌదీ అరేబియా ప్రకటన నిరాశ కలిగిస్తోంది. కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) ప్రభావం ఉన్న దేశాల వారిని యాత్రకు అనుమతించేది లేదని ఆ దేశం తాజాగా వెల్లడించింది. అయితే ఈ నిషేధం ఎప్పటి వరకు ఉంటుంది, ఏయే దేశాల వారిని అనుమతించరన్న విషయాలు మాత్రం ఆ దేశం ఇంకా స్పష్టంగా ప్రకటించ లేదు.

ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాకు కేవలం హజ్‌ సమయంలోనే కాకుండా (ఉమ్రా) ఏడాది పొడవునా లక్షల సంఖ్యలో యాత్రికుల తాకిడి ఉంటుంది. దీనికోసం సౌదీ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రత్యేక వీసాలను జారీ చేస్తుంది. కానీ ఈ ఏడాది వీసాల జారీ విషయంలో ఆలోచనలో పడింది.

ముఖ్యంగా కరోనా వైరస్‌  ప్రస్తుతం చైనాను వణికిస్తోంది. ఇరాన్‌, కువైట్‌, బహ్రెయిన్‌ దేశాల్లో కూడా కరోనా ప్రభావం ఉంది. దీంతో అప్రమత్తమైన సౌదీ ప్రభుత్వం వైరస్‌ బాధిత దేశాల వారికి వీసాల జారీని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం ఉమ్రా యాత్రికులనే కాకుండా మదీనాను సందర్శించే వారిని సైతం అనుమతించమని పేర్కొంది.