టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లీ అగ్రస్థానం పతనం... టాప్ టెన్ లోకి ప్రవేశించిన మయాంక్ అగర్వాల్

26-02-2020 Wed 15:35
  • కివీస్ తో తొలి టెస్టులో విఫలమైన కోహ్లీ
  • రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 21 పరుగులు
  • ఓ స్థానం పతనమై రెండో ర్యాంకులో నిలిచిన వైనం
Kohli slips one place in ICC Test Rankings
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని కోల్పోయాడు. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో పేలవ ప్రదర్శనే అందుకు కారణం. వెల్లింగ్టన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి కేవలం 21 పరుగులే చేసిన కోహ్లీ తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఒక స్థానం పతనమై రెండో స్థానంలో నిలిచాడు. ఆసీస్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.

టీమిండియాతో టెస్టులో రాణించిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్ సంచలనం మార్నస్ లబుషేన్ నాలుగో స్థానంలో నిలవగా, టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ టాప్-10లో ప్రవేశించాడు. మయాంక్ 727 రేటింగ్ పాయింట్లతో పదో స్థానంలో ఉన్నాడు. అజింక్యా రహానే ఈ ర్యాంకింగ్స్ లో 8వ స్థానం దక్కించుకోగా, చటేశ్వర్ పుజారా రెండు స్థానాలు పతనమై 9వ ర్యాంకుకు పడిపోయాడు.