Delhi Clashes: ట్రంప్ వెళ్లేంత వరకైనా ఓపిక పట్టాల్సింది.. ఢిల్లీకి ఇంత చెడ్డ పేరు ఎప్పుడూ రాలేదు: శివసేన

  • ఢిల్లీ హింస హర్రర్ సినిమాను తలపిస్తోంది
  • ట్రంప్ ఢిల్లీలో ఉన్న వేళ హింస చోటు చేసుకోవడం దారుణం
  • ఈ హింసకు ఎవరు బాధ్యత వహిస్తారు?
Delhi Violence Depicts Reality Of 1984 Riots says Shiv Sena

ఢిల్లీలో చోటు చేసుకున్న హింస ఒక హర్రర్ సినిమా రీతిలో ఉందని శివసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లను తలపించే విధంగా ఉందని వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షుడు ఇండియా పర్యటనలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న రక్తపాతం ఢిల్లీకి మచ్చ తెచ్చే విధంగా ఉందని పేర్కొంది. వీధుల్లో రక్తపాతం జరుగుతున్న సమయంలో ట్రంప్ కు ఢిల్లీ స్వాగతం పలికిందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు తన అధికార పత్రిక సామ్నాలో ఓ కథనాన్ని ప్రచురించింది.

ఢిల్లీ హింస వల్ల శాంతిభద్రతలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందనే సందేశం ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని శివసేన అభిప్రాయపడింది. ఢిల్లీ వీధుల్లో కర్రలు, కత్తులు, తుపాకీలు పట్టుకున్న ప్రజలు కనిపిస్తున్నారని... వీధుల్లో రక్తం ఏరులై పారుతోందని తెలిపింది. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని బీజేపీ ఇప్పటికీ విమర్శిస్తోందని... ఇప్పుడు ఢిల్లీలో చోటుచేసుకున్న హింసకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. ఇదే సమయంలో కొందరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు, హెచ్చరికలను ప్రస్తావించింది.

ప్రేమ సందేశంతో వచ్చిన ట్రంప్ ను అహ్మదాబాద్ 'నమస్తే' అంటూ ఆదరించిందని... ఢిల్లీ మాత్రం హింసతో స్వాగతం పలికిందని శివసేన వ్యాఖ్యానించింది. ఏరోజు కూడా ఢిల్లీకి ఇంతటి చెడ్డ పేరు రాలేదని తెలిపింది. ఈ హింస వెనుక ఒక కుట్ర దాగుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని... ఆర్టికల్ 370, 35ఏలను రద్దు చేసిన తర్వాత ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా ధైర్యంతో చర్యలు తీసుకున్నారని... ఇప్పుడు సీఏఏ వ్యతిరేక అల్లర్లు తలెత్తకుండా అదే ధైర్యంతో ముందుగానే చర్యలు తీసుకుని వుండాల్సిందని వ్యాఖ్యానించింది. సీఏఏ అల్లర్ల వెనుక ఏదైనా కుట్ర ఉన్నట్టైతే... అది కచ్చితంగా జాతీయ భద్రతకు ముప్పేనని తెలిపింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయిన తర్వాతే ఈ హింస చోటు చేసుకుందని... బీజేపీ ఓటమి తర్వాత ఢిల్లీ పరిస్థితి ఇదని శివసేన వ్యాఖ్యానించింది. బీజేపీ నేతల వ్యాఖ్యలే ఈ హింసకు కారణమని కొందరు ఆరోపిస్తున్నారని... ఈ స్థాయిలో హింసను ప్రేరేపించేందుకే షహీన్ బాగ్ లో శాంతియుత ర్యాలీలకు వారు మద్దతు పలికారా? అని ప్రశ్నించింది. డొనాల్డ్ ట్రంప్ ఇండియా వదిలి వెళ్లేంత వరకైనా వారు ఓపిక పట్టాల్సిందని మండిపడింది.

More Telugu News