Hyderabad: భిక్షగాళ్ల ఇంట్లో చోరీ: రూ.2 లక్షల నగదు, 25 గ్రాముల బంగారం అపహరణ

  • అనంతపురం జిల్లా పమిడిలో ఘటన 
  • హైదరాబాద్ లో యాచించగా వచ్చిన డబ్బు ఇక్కడ నిల్వ 
  • చోరీ బంగారం తాకట్టుకు యత్నిస్తుండగా నిందితులను పట్టుకున్న పోలీసులు
theaft in beggars house

భిక్షాటన చేసుకునే దంపతుల ఇంట్లో రూ.3 లక్షల సొత్తు చోరీ చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు మైనర్ బాలుడు కావడంతో జువైనల్ హోంకు, మిగిలిన నిందితుడిని జైలుకు పంపారు. పోలీసుల కథనం మేరకు...అనంతపురం జిల్లా పమిడికి చెందిన దంపతులు నాగరాజు, సరస్వతి దివ్యాంగులు. హైదరాబాద్ లో భిక్షాటన చేయడం వీరికి అలవాటు. ఆ విధంగా సంపాదించిన మొత్తాన్ని ప్రతి ఇరవై రోజులకోసారి సొంతూరు పమిడి వచ్చి తమ ఇంట్లోని బీరువాలో భద్రపరిచేవారు. ఈ విధంగా మూడు లక్షలు కూడబెట్టారు. ఓ ఇరవై ఐదు గ్రాముల బంగారం కూడా కొని దాచుకున్నారు. ఈ ఇంట్లో నాగరాజు తల్లి నారాయణమ్మ మాత్రమే ఉంటోంది.

ఈ విషయాన్ని నిందితుడు రామాంజనేయులు గమనించాడు. నారాయణమ్మ డిసెంబరు 10న ఓ వివాహానికి వెళ్లిందని తెలుసుకున్న రామాంజనేయులు ఓ బాలుడితో కలిసి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న నగదు, బంగారం అపహరించాడు. పెళ్లి నుంచి తిరిగి వచ్చిన నారాయణమ్మ చోరీ జరిగిందని గుర్తించి కొడుక్కి చెప్పడంతో డిసెంబరు 22న నాగరాజు పమిడి వచ్చి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తొలుత 3 లక్షల నగదు, 25 గ్రాముల బంగారం అని ఫిర్యాదుచేసి తర్వాత లక్ష ఉందని, 2 లక్షల నగదే పోయిందని పోలీసులకు తెలిపాడు. కేసు విచారిస్తున్న పోలీసులకు ఓ బాలుడు బంగారం తాకట్టు పెట్టుకుంటావా? అని పలువురిని అడుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టి పెన్నానది ఒడ్డున ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద నిందితుడు రామాంజనేయులతోపాటు ఆ బాలుడిని పట్టుకున్నారు.

అప్పటికే 2 లక్షల నగదులో నిందితుడు రూ.40 వేలు ఖర్చు చేసేశాడు. తనకు సహకరించిన బాలుడికి రూ.10 వేలు ఇచ్చాడు. దీంతో మిగిలిన రూ.1.50 లక్షల నగదు, 25 గ్రాముల బంగారాన్ని వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు రామాంజనేయులుని జైలుకు, బాలుడిని జువైనల్ హోంకు తరలించారు.

More Telugu News