CAA: ఢిల్లీ అల్లర్లలో 17కు పెరిగిన మృతుల సంఖ్య.. నేడు కేంద్ర మంత్రివర్గం భేటీ

  • కల్లోల ప్రాంతాలను పరిశీలించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
  • ఆందోళనలపై నేటి మధ్యాహ్నం విచారణ జరపనున్న ఢిల్లీ హైకోర్టు
  • ఈశాన్య ఢిల్లీలో కొనసాగుతున్న ఉద్రిక్తత
17 Dead In Delhi Clashes NSA Ajit Doval Visits Violence Hit Areas

సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. మంగళవారం మధ్యాహ్నం నుంచీ బుధవారం అర్ధరాత్రి వరకు సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. వందలాది మంది గాయపడ్డారు. రాళ్లు విసురుకోవడాలు, దుకాణాల విధ్వంసం, రోడ్లపై టైర్లు వేసి నిప్పుపెట్టడం, వాహనాలు తగలబెట్టడం వంటి ఘటనలు జరిగాయి. దాంతో ఈశాన్య ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధించారు. ఆయా ప్రాంతాల్లోని వ్యాపార, వాణిజ్య సముదాయాలు, స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు.

శాంతి భద్రతలను పరిశీలించిన అజిత్ దోవల్

కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం అర్ధరాత్రి ఈశాన్య ఢిల్లీలోని కల్లోల ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి పోలీసులతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో కలిసి శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. జఫరాబాద్, మౌజ్ పూర్, గోకుల్ పురి చౌక్, శీలంపూర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఢిల్లీ హైకోర్టు కూడా మంగళవారం అర్ధరాత్రి అత్యవసరంగా పరిస్థితిని సమీక్షించింది. తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది. బుధవారం మధ్యాహ్నం ఈ అంశంపై మరోసారి విచారణ జరపాలని నిర్ణయించింది. గాయపడ్డ వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించింది.

కేంద్ర కేబినెట్ లో చర్చ

ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశం అవుతోంది. యాంటీ సీఏఏ ఆందోళనల విషయంలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చించనుంది.

More Telugu News