gold: చుక్కలు చూపిస్తున్న బంగారం ధర.. వెయ్యి పెరిగి రూ. 45 వేలు దాటేసిన వైనం!

  • బంగారాన్ని పరుగులు పెట్టిస్తున్న కోవిడ్-19
  • బంగారంపై పెట్టుబడులు గుమ్మరిస్తున్న మదుపర్లు
  • ఏడాదిలో ఏకంగా రూ.12,200 పెరుగుదల
Gold rates reach all time high

చైనాలో కరోనా వైరస్ సంగతేమో కానీ బంగారం ధర మాత్రం పట్టపగ్గాలు లేకుండా పరుగులు తీస్తోంది. 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 5 వేలకు పైగా పెరిగి గుబులు పుట్టిస్తోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగి రూ. 45 వేల మార్కును చేరుకుంది. ఇది ఆల్‌టైమ్ హై కావడం గమనార్హం.

కోవిడ్-19 కారణంగా స్టాక్ మార్కెట్లలో భయాందోళనలు నిండుకున్నాయి. దీంతో సురక్షిత పెట్టుబడిగా భావించే పుత్తడిపైకి మదుపర్లు తమ పెట్టుబడులను మళ్లించడంతో దాని ధర అంతకంతకూ పెరుగుతోంది. ఒక్కసారిగా వెల్లువెత్తిన పెట్టుబడులతో పసిడి ధర 36 డాలర్లు పెరిగి ఔన్సు ధర 1680 డాలర్లకు ఎగబాకింది. దీనికి తోడు డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు భగ్గుమన్నాయి.

సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ.953 పెరిగి రూ.44,472కు చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో సాయంత్రానికి అది రూ. 45 వేల మార్క్‌కు చేరుకుంది. 15 రోజుల్లోనే రూ. 5 వేలకుపైగా పెరిగిన బంగారం ధర ఏడాదిలో ఏకంగా రూ.12,200 పెరగడం గమనార్హం. గతేడాది మార్చిలో పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.32,800 ఉండగా, తాజాగా రూ. 45 వేలకు చేరుకుంది.

More Telugu News