Donald Trump: ట్రంప్ కు ఆతిథ్యం ఇవ్వనున్న ఐటీసీ మౌర్యా హోటల్ లోని ప్రెసిడెన్షియల్ సూట్... అద్దె ఎంతో తెలిస్తే అవాక్కే మరి!

  • నేటి రాత్రి ప్రెసిడెన్షియల్ సూట్ లో బస
  • ట్రంప్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
  • రాత్రి అద్దె రూ. 8 లక్షలు
Per Night Eight Lakhs for trump suit room

నేటి రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన అర్ధాంగి మెలానియాతో కలిసి న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్యా లగ్జరీ హోటల్, 14వ అంతస్తులో ఉన్న చాణక్యా గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ లో బస చేయనున్నారు. ఈ హోటల్ లో ట్రంప్ దాదాపు 24 గంటల పాటు బస చేయనుండగా, ఒక రాత్రికి రూ. 8 లక్షల అద్దె చార్జ్ చేస్తున్నట్టు హోటల్ ప్రకటించింది. ఇది కేవలం చాణక్య గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ కు మాత్రమే.

ఇది కాకుండా, హోటల్ లోని 428 గదులను అమెరికా అధికారులు, ట్రంప్ సిబ్బందికి కేటాయించారు. వీటి అద్దెను కూడా కలిపితే, మొత్తం ఐటీసీకి కోట్లలోనే ముడుతుంది. ఇక ట్రంప్ కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్ నర్ తదితరులు, మరో సూట్ రూమ్ లో బస చేస్తారు. ట్రంప్ తో పాటు అమెరికా నుంచి వచ్చిన అధికారులు, మీడియా సిబ్బందికి కూడా ఇదే హోటల్ లో గదులు కేటాయించారు.

ఇక ట్రంప్ సేదదీరే గదిని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సిల్క్ ప్యానల్ గోడలు, వుడెన్ ఫ్లోరింగ్, అందమైన కళాకృతులను తీర్చిదిద్దారు. ఈ గదిలో 12 మంది కలిసి కూర్చుని భోజనం చేసే సదుపాయంతో పాటు, రిసెప్షన్ ఏరియా, మినీ జిమ్, ప్రత్యేక స్పా కూడా ఉన్నాయి. ఇక ట్రంప్ కోసం ఆయనకు ఇష్టమైన చెర్రీ వెనీలా ఐస్ క్రీమ్, డైట్ కోక్ తదితరాలను సూట్ లో సిద్ధంగా ఉంచారు. ట్రంప్ దంపతులకు వండి వడ్డించేందుకు ప్రత్యేక చెఫ్ ను అందుబాటులో ఉంచారు.

కాగా, ఈ చాణక్య ప్రెసిడెన్షియల్ సూట్ లో బస చేస్తున్న నాలుగో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గతంలో బిల్ క్లింటర్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామాలు ఇండియా పర్యటనకు వచ్చిన సమయంలో ఇక్కడే బస చేశారు.

More Telugu News