Tangirala Soumya: అధికారంలో ఉండి పాదయాత్రలా? సిగ్గు సిగ్గు: తంగిరాల సౌమ్య

  • రాజధాని అమరావతిలోనే ఉండాలి
  • నందిగామ ఎమ్మెల్యే పాదయాత్ర విరమించాలి
  • మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
Shameful for YCP Mla Jaganmohanrao

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పాదయాత్రలు చేస్తుండటం సిగ్గు చేటని తెలుగుదేశం పార్టీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిప్పులు చెరిగారు. పదవుల కోసం ప్రజల మనోభావాలను పణంగా పెట్టిన నందిగామ ఎమ్మెల్యే జగన్మోహనరావు, ఇప్పుడు మూడు రాజధానులు కావాలంటూ, పాదయాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, పాలన వికేంద్రీకరణ వద్దని, రాజధాని అమరావతిలోనే ఉండాలని రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటుంటే, రాజధానులు మూడు కావాలని  శ్రీశైలంకు పాదయాత్ర తలపెట్టడం ఏంటని ప్రశ్నించారు. రాజధానిగా అమరావతి ఉండదన్న భావన ప్రజలకు తీవ్ర మనోవేదనను కలిగించిందని, ఇప్పటికైనా జగన్మోహనరావు తన తప్పును తెలుసుకుని, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అన్నారు.

అమరావతిలోనే రాజధాని ఉండాలని జగన్ పై ఒత్తిడిని పెంచాలని సూచించారు. వైఎస్ జగన్ 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని, ఆయన తన మురికిని చంద్రబాబుకు అంటించాలని చూస్తున్నారని, ఆ ఉద్దేశంతోనే సిట్ ను ఏర్పాటు చేశారని నిప్పులు చెరిగారు. ఎన్ని సిట్ లు, సీఐడీ, సీబీఐలు వేసినా చంద్రబాబుకు అవినీతి మరకను అంటించలేరని సౌమ్య వ్యాఖ్యానించారు.

More Telugu News