Donald Trump: ట్రంప్​, మోదీ రానున్న మొతెరా స్టేడియం ఎంట్రీ గేటు కూలింది

  • గట్టిగా గాలి వీయడంతో కూలిన తాత్కాలిక ఎంట్రీ గేట్లు
  • వెంటనే క్రేన్లు తెప్పించి తిరిగి ఏర్పాటు చేసిన అధికారులు
  • ఇంకా నయం అహ్మదాబాద్లో కట్టిన గోడ కూడా కూలిపోలేదంటూ కాంగ్రెస్ సెటైర్లు
Entry Gate Of Motera Stadium Collapses Ahead Of Trump Visit

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం, ట్రంప్–మోదీల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న మొతెరా స్టేడియంలో వీవీఐపీల ఎంట్రీ గేటు ఆదివారం కూలిపడింది. వీవీఐపీల రాక కోసం స్టేడియం బయట తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ గేటు ద్వారానే ట్రంప్, మోదీ ఇతర ప్రముఖులు స్టేడియంలోకి రానున్నారు. ఆదివారం స్టేడియం పరిసరాల్లో గట్టిగా గాలి వీయడంతో ఈ గేటు పడిపోయింది. అధికారులు వెంటనే క్రేన్లు తెప్పించి, ఆ గేటును యధావిధిగా నిలబెట్టే పనిలో పడ్డారు.

పక్కనే ఉన్న మరో గేటు కూడా..

వీవీఐపీ ఎంట్రీ గేటుతోపాటు మెయిన్ ఎంట్రన్స్ వైపు ఏర్పాటు చేసిన ఇంకో తాత్కాలిక ఎంట్రీ గేటు కూడా కొంత భాగం కూలి పడింది. అధికారులు దానిని కూడా సరిచేసే పని చేపట్టారు. ఈ ఘటనల్లో ఎవరూ గాయపడలేదని, గట్టిగా గాలి వీయడంతోనే గేట్లు పడిపోయాయని తెలిపారు.

మందపాటి స్టీల్ తో కట్టినా..

మందపాటి స్టీల్ రాడ్లను వెల్డింగ్ చేసి ఈ ఎంట్రీ గేట్లను తయారు చేశారు. వాటిపై ట్రంప్, మోదీలను స్వాగతిస్తూ ఫ్లెక్సీలు కట్టారు. వాటిని గట్టిగానే ఏర్పాటు చేసినా గాలి తీవ్రతకు కూలిపడ్డాయని, అది పెద్ద ఘటన ఏమీ కాదని, ఎవరూ గాయపడలేదని అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీస్ కమిషనర్ అజయ్ తోమర్ ప్రకటించారు. స్టేడియం గేటు కూలిన వీడియోలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. వాటిని స్థానిక న్యూస్ చానళ్లు ప్రసారం చేశాయి.

ట్రంప్ ముందు అభివృద్ధి బయటపడేది: కాంగ్రెస్

స్టేడియం గేటు కూలిపోవడంపై కాంగ్రెస్, ఇతర పార్టీల నేతల నుంచి విమర్శలూ మొదలయ్యాయి. ‘‘ట్రంప్ రాకముందే స్టేడియం ఎంట్రీ గేటు కూలిపోయింది. అహ్మదాబాద్ లో మురికివాడలు కనిపించకుండా కట్టిన గోడ కూడా కూలిపోదని ఆశిస్తున్నాం. లేకపోతే ట్రంప్ ముందు మన అభివృద్ధి అంతా బయటపడేది” అంటూ ట్వీట్లు చేశారు.

More Telugu News