Scott Styris: రేపు న్యూజిలాండ్ ఆటగాళ్ల లక్ష్యం రహానే: కివీస్ మాజీ ఆటగాడు స్కాట్ స్ట్రైరిస్

  • వెల్లింగ్టన్ లో భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు
  • పోరాడుతున్న భారత్
  • క్రీజులో రహానే, విహారి
Scott Styris says New Zealanders may target Rahane tomorrow

వెల్టింగ్టన్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య జట్టుదే పైచేయిగా ఉంది. మూడో రోజు ఆటలో కోహ్లీ సేన 4 వికెట్లకు 144 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే, హనుమ విహారి ఉన్నారు. అయితే, రేపటి ఆటలో రహానే ఎంతో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని కివీస్ మాజీ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. కేన్ విలియమ్సన్ ఎలాంటి టెక్నిక్ ఉంటుందో, రహానే కూడా అలాంటి టెక్నిక్ తోనే ఆడతాడని తెలిపాడు. బంతిపైకి వెళ్లకుండా, బంతి తన వద్దకు వచ్చే వరకు ఆగి కొట్టడంలో రహానే నిష్ణాతుడని పేర్కొన్నాడు.

రహానే క్రీజులో ఎంత ఎక్కువ సేపు ఉంటే భారత్ కు అంత లాభిస్తుందని, అందుకే రహానేను రేపు ఉదయం సెషన్లో వీలైనంత తొందరగా అవుట్ చేసేందుకు న్యూజిలాండ్ ఆటగాళ్లు ప్రయత్నిస్తారని స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. కాగా, ఈ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 165 పరుగులకు ఆలౌట్ కాగా, 348 పరుగులు చేసిన కివీస్ 183 పరుగుల కీలక ఆధిక్యం సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి భారత్ ఇంకా 39 పరుగులు వెనుకబడి ఉండడంతో ఈ మ్యాచ్ పై కివీస్ పట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

More Telugu News