నూజివీడు ట్రిపుల్ ఐటీలో భద్రత కట్టుదిట్టం చేస్తాం: మంత్రి ఆదిమూలపు

23-02-2020 Sun 17:17
  • నూజివీడు ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశించిన యువకుడు
  • సహకరించిన విద్యార్థిని
  • అలసత్వం ప్రదర్శించిన సిబ్బందిపై చర్యలు ఉంటాయన్న మంత్రి
Minister Adimulapu Suresh responds on Nujiveedu IIIT incident

నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ యువకుడు ప్రవేశించి రాత్రంతా గడిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ అమ్మాయి సహకారంతో క్యాంపస్ లోకి చొరబడిన యువకుడు రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఇతర విద్యార్థినులు ఆ యువకుడు, విద్యార్థిని ఉన్న గదికి తాళం వేసి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు.

కాగా, ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తప్పవని అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రత మరింత పెంచుతామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.