india: సైబర్​ దాడులకు గురయ్యే టాప్​ మూడో దేశం ఇండియానే: ఎఫ్​ బీఐ నివేదిక వివరాలివీ

  • ఏటా వేలాది కేసులు.. కోట్లలో నష్టం
  • జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఎఫ్ బీఐ
  • ఫోన్లు, ఎస్సెమ్మెస్ మోసానికి దూరంగా ఉండాలని సూచన
India stands third among top 20 cyber crime victims says FBI report

ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ బారినపడే టాప్ – 20 దేశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉందని అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ పేర్కొంది. ఈ జాబితాలో ఏకంగా 93,796 సైబర్ నేరాలతో అమెరికా టాప్ లో ఉందని, 3,721 నేరాలతో కెనడా రెండో స్థానంలో, 2,901 నేరాలతో ఇండియా మూడో స్థానంలో ఉందని తమ నివేదికలో వెల్లడించింది.

2019 రిపోర్టు విడుదల

2019 సంవత్సరానికి సంబంధించి ఎఫ్ బీఐలోని ‘ఇంటర్నెట్ క్రైమ్ కంప్లైంట్ సెంటర్’ ఈ నివేదికను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ నేరాల బారినపడుతున్న టాప్ 20 లిస్టును సిద్ధం చేసింది. నేరాల సంఖ్య, వాటి కారణంగా జరిగిన నష్టం, ఏయే మార్గాల్లో నేరాలకు పాల్పడ్డారన్న వివరాలను అందులో పేర్కొంది. మొత్తంగా సైబర్ నేరాలకు సంబంధించి భారీగా కేసులు నమోదైనా వాటిల్లో గుర్తించిన బాధితుల సంఖ్యను లెక్కించింది. ఫోన్లకు మెసేజ్ లు పంపడం ద్వారా, నకిలీ వెబ్ సైట్ల ద్వారా, ఈ మెయిల్ ఫిషింగ్ ద్వారా ఎక్కువ నేరాలు జరిగినట్టు పేర్కొంది.

అమెరికాలో సైబర్ క్రైమ్ నష్టం రెండున్నర లక్షల కోట్లు

అమెరికాలో గత ఏడాది 4,67,361 సైబర్ నేరాల ఫిర్యాదులు వచ్చాయని, వాటి ద్వారా సుమారు రెండున్నర లక్షల కోట్లు (3,500 కోట్ల డాలర్లు) నష్టం జరిగిందని ఎఫ్ బీఐ నివేదికలో పేర్కొంది.

మన దేశంలోనూ వేల సంఖ్యలో కేసులు

భారత జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2018లో 27,248 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. అదే 2019లో 33,152కు పెరిగాయి.

జాగ్రత్తగా ఉండాలి: ఎఫ్ బీఐ

బ్యాంకు ఖాతాలు, డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడాల విషయంగా మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో.. సైబర్ క్రైమ్ ల విషయంగా కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని ఎఫ్ బీఐ ప్రతినిధి డొన్నా గ్రెగరీ పేర్కొన్నారు. డబ్బుల విషయంగా రెండోసారి ఆలోచించినట్టే.. ఏదైనా మెసేజ్, ఫోన్ కాల్ వచ్చినప్పుడు మరోసారి ఆలోచించాలని, ఎవరినైనా సంప్రదించి సలహా తీసుకోవాలని సూచించారు.

More Telugu News