కోహ్లీ ఫీల్డింగ్ మోహరింపులపై వీవీఎస్ లక్ష్మణ్ అసంతృప్తి

23-02-2020 Sun 16:07
  • కొత్త బంతితో విరాట్ వ్యూహాలు సరిగ్గా లేవు
  • ఫీల్డింగ్ ఏర్పాటు కూడా బాగాలేదు 
  • మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్
Tactics used by Virat Kohli were not right
వెల్లింగ్టన్  లో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం సాధించడానికి  కారణం కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుసరించిన వ్యూహాలే అని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. విరాట్ చేసిన తప్పిదాల కారణంగా భారత్ మ్యాచ్ కోల్పోయే ప్రమాదం ముంగిట నిలిచిందన్నాడు. మూడో రోజు ఆట మొదలైన వెంటనే  బీజే వాట్లింగ్, ట్రెంట్ బౌల్ట్ వికెట్లు తీసిన బౌలర్లు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. కానీ, అదే తీవ్రతను కొనసాగించడంలో విఫలమవడంతో ఆతిథ్య జట్టు మళ్లీ రేసులోకొచ్చింది. చివరి మూడు వికెట్ల సాయంతో 132 పరుగులు జోడించిన కివీస్ భారీ ఆధిక్యం సాధించి భారత్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

అయితే, కోహ్లీ ప్రణాళికా లోపం వల్లే ఇలా జరిగిందని లక్ష్మణ్  అంటున్నాడు. ‘టిమ్ సౌథీ వికెట్ తీసిన తర్వాత భారత్ ప్రత్యర్థిపై ఒత్తిడి  కొనసాగించలేకపోయింది. ఒక దశలో కివీస్ 100 పరుగుల ఆధిక్యం కూడా సాధించేలా కనిపించలేదు. కానీ జెమీసన్, గ్రాండ్ హోమ్ కీలక భాగస్వామ్యంతో ఆ జట్టు ఏకంగా 183 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత్ మరీ రక్షణాత్మకంగా ఆడడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా రెండో కొత్త బంతితో బౌలింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీ అనుసరించిన వ్యూహాలు సరిగ్గా లేవు. ఆ సమయంలో ఫీల్డింగ్ ఏర్పాటు కూడా బాగాలేదు. విదేశాల్లో ఆడుతున్నప్పుడు కొత్త బంతి ప్రభావం చాలా ఉంటుంది. కానీ, నాలుగు ఓవర్లు వేసిన తర్వాత  కోహ్లీ స్పిన్నర్ అశ్విన్ ను బరిలోకి దింపాడు. అది సరికాదు. ముగ్గురు పేసర్లు అందుబాటులో ఉన్నప్పుడు టెయిలెండర్లకు వాళ్లతోనే బౌలింగ్ చేయించాల్సింది. కోహ్లీ ఈ ట్రిక్ మిస్సయ్యాడు. ఇది భారత్ కు మ్యాచ్ ను దూరం చేసేలా ఉంది’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.