Donald Trump: ట్రంప్ కుటుంబం కోసం ప్రత్యేక మెనూ అందించాలని ఐటీసీ మౌర్య హోటల్ కు సూచనలు

  • మెలానియా నట్స్ తినరు.. ట్రంప్ కు సీ ఫుడ్ ఇష్టం
  • శ్వేతసౌథం నుంచి హోటల్ సిబ్బందికి జాబితా
  • ఐటీసీ మౌర్య హోటల్ మొత్తం ట్రంప్ , ఆయన సిబ్బందికే 
  • మూడు రోజులు ఇతరులకు బుకింగ్స్ బంద్
Trump loves seafood

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఇప్పుడు మన దేశంలో హాట్ టాపిక్. తొలిసారి భారత్ కు వస్తున్న ట్రంప్ కోసం ప్రభుత్వం భారీ ఏర్పాటు చేస్తోంది. ట్రంప్ తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంకా కూడా సోమ, మంగళవారాల్లో భారత్ లో ఉంటారు. అసలే అమెరికా అధిపతి కుటుంబం కాబట్టి..  భోజనం చేసేందుకు బంగారు, వెండి పాత్రలూ తయారు చేయించారు. మరి, ట్రంప్ కుటుంబ సభ్యులు ఏం తింటారనే దానిపై ఆసక్తి నెలకొంది.

దీనిపై అమెరికా శ్వేతసౌథం ఇప్పటికే ట్రంప్ బసచేసే ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్ కు పలు సూచనలు చేసింది. అమెరికా ప్రథమ మహిళ అయిన మెలానియా నట్స్ తినరు. ట్రంప్ మాత్రం సీ ఫుడ్ ను ఇష్టపడతారట. అలాగే, పెళ్లికి ముందు జుడాయిజంలోకి కన్వర్ట్ అయిన ఇవాంకా కొషెర్ డైట్ ను ఫాలో అవుతారు. ఈ లెక్కన ఐటీసీ మౌర్య లో వంటకాలు సిద్ధం చేస్తున్నారట.

ఇక, హోటల్ కు వచ్చే ట్రంప్ ఫ్యామిలీకి రకరకాల ముగ్గులతో స్వాగతం పలికే అవకాశం ఉంది. భద్రత, ఇతర ఏర్పాట్లపై అధికారులు రహస్యం పాటిస్తున్నప్పటికీ ట్రంప్, ఆయన సిబ్బంది కోసం హోటల్ మొత్తం బుక్ చేసినట్టు తెలుస్తోంది. మూడు రోజుల పాటు మరే ఇతర వ్యక్తులను హోటల్ కు అనుమతించడం లేదు.

బుష్, క్లింటన్, ఒబామా ఉన్న సూట్ లోనే ట్రంప్

ఈ హోటల్లో ట్రంప్.. 446 చదరపు అడుగుల విశాలమైన గ్రాండ్ ప్రెసిడెంట్ సూట్ అయిన చాణక్యలో ఉంటారు. గతంలో భారత పర్యటనకు వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి బుష్, బిల్ క్లింటన్ , బరాక్ ఒబామా కూడా ఇదే సూట్ లో బస చేశారు. ఇందులో నెమలి థీమ్లోని 12 సీట్ల ప్రైవేట్ డైనింగ్ రూమ్, ముత్యాలతో పొదిగిన సామగ్రితో కూడిన  బాత్ రూమ్ , మినీ స్పా, జిమ్  ఉన్నాయి. ఈ సూట్ కు బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ లు ఏర్పాటు చేశారు. అలాగే, సూట్ నుంచి నేరుగా హోటల్ కు, పార్కింగ్ ఏరియాకు వెళ్లేందుకు ప్రత్యేక దారి ఉంటుంది. హై స్పీడ్ ఎలివేటర్ కూడా ఉంది. అలాగే, ప్రెసిడెన్షియల్ సూట్ లో  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల ప్రకారం స్వచ్ఛమైన గాలి ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ సూట్ కు ఎదురుగా ఉండే మరో సూట్ ను ఇవాంకాకు కేటాయించారు.

More Telugu News