అమ్మా కత్తి ఇవ్వు.. గుండెల్లో పొడుచుకొని చచ్చిపోతా: తోటి విద్యార్థుల హేళనకు పసిమనసు వేదన!

22-02-2020 Sat 15:57
9 year old Quaden Bayles Bullied at school
  • తొమ్మిదేళ్ల మరుగుజ్జు చిన్నారి కన్నీటి పర్యంతం
  • పొట్టిగా ఉన్నావంటూ తోటి విద్యార్థుల హేళనతో మనోవేదన 
  • వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన తల్లి 
  • వికలాంగ చిన్నారులను వేధించొద్దని వినతి

ఆ చిన్నారికి తొమ్మిదేళ్లు. మరుగుజ్జు కావడంతో రెండేళ్ల పసివాడిలా కనిపిస్తున్నాడు. అయినా తనకు వైకల్యం ఉన్న సంగతి మరిచి అందరు పిల్లల మాదిరిగా తాను కూడా చదువుకోవాలని అనుకున్నాడు. కానీ, స్కూలుకు వెళ్తే ఇతర విద్యార్థులు అతడిని వెక్కిరిస్తున్నారు. పొట్టిగా ఉన్నావంటూ చీత్కరిస్తున్నారు.

ఎంతలా అంటే ‘ఈ వేధింపులు నేను భరించలేను. ఓ కత్తి ఇస్తే నేను గుండెల్లో పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ తన తల్లితో కన్నీటి పర్యంతమయ్యేలా. ఆస్ట్రేలియాలో జరిగిందీ ఘటన. తన కొడుకు వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ పిల్లాడి తల్లి..  వైకల్యం ఉన్న చిన్నారులను వేధిస్తే వాళ్లు ఎలా బాధపడుతారో ప్రపంచానికి తెలియ జేసింది.

స్కూల్లో తన కుమారుడికి ప్రతి రోజు ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందని వాపోయింది. ఆటపాటలతో హాయిగా గడుపుతూ చదువుకోవాల్సిన చోట తెలిసీ తెలియని వయసులో తోటి విద్యార్థులు వ్యవహరించే తీరు వైకల్యం ఉన్న చిన్నారులను కుంగదీస్తోందని తెలిపింది. దీని వల్ల ఆ చిన్నారుల కుటుంబాలు కూడా ఎంతగానో బాధకు గురవుతున్నాయని చెప్పింది.

శారీరక వైకల్యం ఉన్న వారిని హేళన చేయకూడదని తమ పిల్లలకు చెప్పాలని తల్లిదండ్రులను కోరింది. ఇప్పుడా వీడియో నెట్ లో వైరల్ గా మారింది. ఇప్పటికే 15 మిలియన్ల వ్యూస్ రాగా, ఫేస్ బుక్ లో 2.85 లక్షల మంది షేర్ చేశారు. ఆస్ట్రేలియా నేషనల్ రగ్బీ లీగ్ ఆటగాళ్లు సదరు చిన్నారి, అతని తల్లికి సంఘీభావం ప్రకటించారు. హాలీవుడ్ నటుడు హుగ్ జాక్ మన్ ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేసి ‘నువ్వు నా స్నేహితుడివి’ అని ట్వీట్ చేశాడు.