Amaravati: పేదల కోసం ఇళ్ల స్థలాల సర్వేకు వచ్చిన అధికారులు.. అడ్డుకున్న రాజధాని రైతులు, మహిళలు

  • దుగ్గిరాల, పెదకాకాని మండలాల్లోని పేదలకు మంగళగిరి భూములు
  • నాలుగు గంటలపాటు తహసీల్దార్‌ను అడ్డుకున్న రైతులు
  • మరోమారు వస్తే తీవ్ర పరిణామాలుంటాయని అధికారులకు హెచ్చరిక
Amaravathi Farmers stops MRO Malliswari Car in Krishnayapalem

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంతంలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాల, పెదకాకాని మండలాల్లోని పేదలకు మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో స్థల పరిశీలన కోసం నిన్న తహసీల్దార్ మల్లీశ్వరి, ఇతర అధికారులు వచ్చారు. కృష్ణాయపాలెం శివారులో అధికారులు కారు దిగి మ్యాపులు పరిశీలిస్తుండగా గమనించిన కొందరు రైతులు వెంటనే ఆ విషయాన్ని కృష్ణాయపాలెంలో దీక్ష చేస్తున్న రైతులకు తెలిపారు.

వెంటనే అప్రమత్తమైన రైతులు పెద్ద సంఖ్యలో అధికారుల వద్దకు బయలుదేరారు. గమనించిన అధికారులు కార్లు ఎక్కి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే అక్కడికి చేరుకున్న రైతులు, మహిళలు తహసీల్దార్ కారుకు అడ్డంగా బైఠాయించారు. ఇక్కడికి ఎందుకు వచ్చారన్న ప్రశ్నకు మల్లీశ్వరి సరైన సమాధానం చెప్పకుండా కారులోనే కూర్చోవడంతో రైతులు కూడా అలాగే కూర్చున్నారు. విషయం తెలిసిన పరిసర గ్రామ రైతులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మధ్యాహ్నం 12 గంటల నుంచి 4:30 వరకు తహసీల్దార్ కారును కదలకుండా అడ్డుకున్నారు. చివరికి స్పందించిన అధికారులు, పోలీసులు ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని, ఇంకా ఖరారు కాలేదని చెప్పడంతో రైతులు శాంతించారు. సర్వేల పేరుతో తమ భూముల్లోకి మరోమారు వస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలకు తాము బాధ్యత వహించబోమని జేఏసీ నేతలు ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.

More Telugu News