Asaduddin Owaisi: 127 మంది హైదరాబాదీలు పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఆదేశాలపై మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ

  • పౌరసత్వాన్ని ధ్రువీకరించే అధికారం ఉడాయ్‌కు లేదు
  • చట్టబద్ధమైన ప్రక్రియను ఉడాయ్‌ పాటించలేదు
  • తనకున్న అధికారాలను దుర్వినియోగం చేసింది 
Owaisi hits out on Aadhaar bodys notice to 127 in Hyderabad

పౌరసత్వం నిరూపించుకోవాలని, ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 20లోగా విచారణకు రావాలని 127 మంది హైదరాబాదీలకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) నోటీసులు జారీ చేసిన విషయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ విరుచుకుపడ్డారు.

'పౌరసత్వాన్ని ధ్రువీకరించే అధికారం ఉడాయ్‌కు లేదు. ఆధార్‌ కార్డులను తప్పుడు సమాచారంతో పొందితే దాన్ని పరిశీలించేందుకు కొన్ని అధికారాలు మాత్రమే ఉడాయ్‌కు ఉంటాయి. చట్టబద్ధమైన ప్రక్రియను ఉడాయ్‌ పాటించలేదు. తనకున్న అధికారాలను దుర్వినియోగం చేసింది' అని అసదుద్దీన్ ఆరోపించారు.

127 మంది హైదరాబాదీలు అక్రమంగా ఆధార్‌ కార్డు పొందారన్న సమాచారాన్ని మీకు ఏ పోలీసు అధికారి ఇచ్చారు? అని ఒవైసీ ప్రశ్నించారు. 127 మందికి సంబంధించిన సమాచారాన్ని ఉడాయ్‌కి ఇచ్చామన్న విషయాన్ని తెలంగాణ డీజీపీ నిర్ధారించాలని ఆయన కోరారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తగ్గించాలని ఆయన ట్వీట్ చేశారు. 

127 మందిలో ఎంత మంది ముస్లింలు, దళితులు ఉన్నారో ఉడాయ్‌, తెలంగాణ పోలీసులు చెప్పాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. కార్డన్ సెర్చ్ సమయంలో ఆధార్‌ కార్డులు అడగడాన్ని తెలంగాణ పోలీసులు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆధార్‌ కార్డు అడగాలని చట్టబద్ధమైన ఆదేశాలేమీ లేవని చెప్పారు.

More Telugu News