జాతీయ రాజకీయాలపైకి ఆప్​ దృష్టి​.. 23వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రచారం ​

17-02-2020 Mon 16:24
  • నెల రోజుల పాటు ప్రచారం చేపట్టనున్నట్టు పార్టీ నేత గోపాల్ రాయ్ వెల్లడి
  • దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ‘రాష్ట్ర నిర్మాణ్’ పేరిట కార్యక్రమాలు
  • కోటి మందికిపైగా ప్రజలను కలవాలని నిర్ణయం
  • స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన
AAP focus on National politics

ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లలో ఘన విజయం సాధించిన ఊపులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

నెల రోజుల పాటు

ఈ నెల 23వ తేదీన తమ క్యాంపెయిన్ మొదలుపెడతామని గోపాల్ రాయ్ తెలిపారు. నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారీ స్థాయిలో క్యాంపెయిన్ నిర్వహిస్తామని తెలిపారు. ‘రాష్ట్ర నిర్మాణ్ (నేషన్ బిల్డింగ్)’ పేరిట పార్టీ నేతలు, వలంటీర్లు సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు. కోటి మందికిపైగా ప్రజలను కలవాలని నిర్ణయించినట్టు చెప్పారు.

దేశవ్యాప్తంగా మిస్స్ డ్ కాల్ క్యాంపెయిన్

దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో మిస్స్ డ్ కాల్ క్యాంపెయిన్ చేస్తామని గోపాల్ రాయ్ తెలిపారు. ‘‘9871010101’ నంబర్ కు మిస్స్ డ్ కాల్ ఇచ్చి ఆప్ లో చేరండి, దేశ నిర్మాణంలో పాలు పంచుకోండి’’ అంటూ పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తామన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు తొలుత రాజధానిలో, తర్వాత పట్టణాల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. తాము చేపట్టిన మిస్స్ డ్ కాల్ క్యాంపెయిన్ తో ఇప్పటికే 12 లక్షల మంది ఆప్ లో చేరారని తెలిపారు.

రాష్ట్రాల స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తాం

వచ్చే కొన్ని నెలల్లో పలు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగనున్నాయని, ఆప్ వాటిలో పోటీ చేసి క్షేత్ర స్థాయి నుంచి కేడర్ ను పెంచుకుంటుందని గోపాల్ రాయ్ చెప్పారు. తర్వాత రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు.