అవన్నీ ఒట్టి పుకార్లే.. రూ.2 వేల నోటు రద్దుపై కేంద్రం

17-02-2020 Mon 11:55
  • ఎటువంటి ఆలోచన లేదన్న ఆర్థిక మంత్రి
  • నోట్లు కనిపించక పోవడం వల్లే ఈ భయాందోళన
  • రద్దు ఇబ్బంది ఏమీ ఉండదన్న నిర్మలాసీతారామన్‌
finance minister clears the doubt about 2 thousand note
రెండు వేల కరెన్సీ నోటును రద్దు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందన్న ఊహాగానాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెరదించారు. కేంద్రం వద్ద అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని స్పష్టం చేశారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే రేగింది. దాదాపు నెల రోజుల పాటు సామాన్యులు కూడా నోట్లు మార్చుకునేందుకు నానాపాట్లు పడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వం వెయ్యి నోటును పూర్తిగా ఎత్తేసి రూ.2 వేల నోటును చలామణిలోకి తెచ్చింది.

అయితే ఇటీవల కాలంలో 2 వేల నోటు మార్కెట్‌లో అంతగా కనిపించకపోవడంతో రద్దు పుకార్లు మొదలయ్యాయి. రూ.2 వేల నోటును రద్దు చేసే యోచనలో కేంద్రం ఉందని, అందువల్ల రిజర్వ్‌బ్యాంక్‌కు చేరుతున్న నోట్లను చేరినట్టే అట్టేపెట్టేస్తోందని, ఈ కారణంగా మార్కెట్లో నోట్ల చలామణి తగ్గిపోయిందని...ఎవరి నచ్చినట్లు వారు ఊహించుకుంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఎట్టకేలకు కేంద్ర ఆర్థిక మంత్రి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం అటువంటి ఆలోచన ఏమీ చేయడం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.