మీడియా మిత్రులారా! క్రిమినల్ చరిత్ర ఉన్న వైసీపీ నాయకులపై ఎపిసోడ్స్ గా చూపించండి: కూన రవికుమార్

16-02-2020 Sun 21:03
  • వైసీపీలో 78 మంది క్రిమినల్స్ ఉన్నారు
  • ఓ నేరస్తుడు అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో సభ్యులుగా ఉంటారా?
  • అవినీతి కేరాఫ్ అడ్రస్ జగన్
TDP leader Kuna Ravi kumar comments on YSRCP

మాజీ పీఎస్ శ్రీనివాస్ పై జరిగిన ఐటీ దాడులను చంద్రబాబునాయుడుకి అంటగట్టాలని జగన్ పేటీఎం బ్యాచ్ చూశారని టీడీపీ నేత కూన రవికుమార్ విమర్శించారు. ఐటీ శాఖ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేదని, ఐటీ అధికారులు ఈరోజు ఇచ్చిన పంచనామా చూశాక వైసీపీ నేతల నోళ్లు మూతబడ్డాయని అన్నారు. వైసీపీలో 78 మంది క్రిమినల్స్ ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ లో క్రిమినల్ చరిత్ర ఉన్న వారి గురించి ‘నేరాలు-ఘోరాలు’లో ఎపిసోడ్స్ కింద వేసుకుంటే రేటింగ్స్ బాగా వస్తాయని మీడియా సోదరులకు ఒక సలహా ఇస్తున్నానంటూ ఆ పార్టీపై విమర్శలు చేశారు.

ఓ నేరస్తుడు అధ్యక్షుడిగా ఉన్న వైసీపీలో తాము సభ్యులుగా ఉన్నందుకు ఆ పార్టీ నాయకులు సిగ్గుపడాలని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రతి శుక్రవారం కోర్టు వెళ్లాల్సి వస్తున్న జగన్ కు అండగా ఉంటారా? అంటూ వైసీపీ నాయకులకు సూటి ప్రశ్న వేశారు. అవినీతి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న జగన్, చంద్రబాబుపై బురదజల్లాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.