ఫిలింఫేర్ అవార్డులు: ఉత్తమ నటుడిగా రణవీర్ సింగ్, ఉత్తమనటిగా అలియా భట్

16-02-2020 Sun 20:23
  • గువాహటిలో ఫిలింఫేర్ అవార్డులు
  • ఇందిరాగాంధీ స్టేడియంలో కన్నులపండువగా వేడుక
  • అత్యధిక అవార్డులు గెల్చుకున్న గల్లీబోయ్ చిత్రం
Ranveer Singh and Alia Bhatt won Filmfare awards

ప్రతిష్ఠాత్మక ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం ఈసారి అసోంలోని గువాహటిలో నిర్వహించారు. ఈ అవార్డుల కార్యక్రమం ఇక్కడి ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియం వేదికగా కన్నులపండువగా జరిగింది. ఈసారి ఉత్తమనటుడి అవార్డును రణవీర్ సింగ్ గెల్చుకోవడం విశేషం. అంతేకాదు, రణవీర్ హీరోగా నటించిన 'గల్లీబోయ్' సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమనటిగా అలియా భట్ అవార్డు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడిగా జోయా అక్తర్ నిలిచారు. జోయా 'గల్లీబోయ్' చిత్రాన్ని తెరకెక్కించారు.

అంతేకాదు, ఈసారి ఫిలింఫేర్ అవార్డుల్లో 'గల్లీబోయ్' మోత మోగించింది. బెస్ట్ మ్యూజిక్ ఆల్బం, ఉత్తమ సాహిత్యం, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లోనూ 'గల్లీబోయ్' చిత్రానికి అవార్డులు లభించాయి. ఈ చిత్రంలో నటించిన సిద్ధాంత్ చతుర్వేది, అమృతా సుభాష్ ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ సహాయనటి అవార్డులు కైవసం చేసుకున్నారు.