బొత్స గారూ... మీకు, నాకు ఇంగ్లీషు ఎందుకు చెప్పండి: దేవినేని ఉమ

16-02-2020 Sun 17:37
  • ఏపీ మంత్రులు బాధ్యతా లేకుండా మాట్లాడుతున్నారన్న ఉమ
  • బొత్స ఏంమాట్లాడుతున్నాడో తమకు అర్థం కాలేదని వ్యాఖ్యలు
  • జగన్ ఆడుతున్న ఆటలో బొత్స అరటిపండులా తయారయ్యాడని విమర్శలు
Devineni Uma slams YSRCP minister Botsa

ఏపీ మంత్రులు బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని, రాజధానిని శ్మశానం అని, ఎన్డీయేతో పొత్తు పెట్టుకుంటామని అంటున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మంత్రులు పిచ్చాపాటీగా అన్న మాటలను పట్టించుకోవద్దని మరో 'బాధ్యతగల' మంత్రి సూచిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఢిల్లీలో ఒక డ్రామా, విశాఖలో ఒక డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ఇవాళ కూడా బొత్స అరగంట సేపు మాట్లాడాడని, ఆయనేం మాట్లాడాడో తమకు అర్థం కాలేదని, కనీసం ప్రజలకైనా అర్థమైందా అని ప్రశ్నించారు. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు కానీ, జగన్ మోహన్ రెడ్డి ఆడుతున్న ఆటలో అరటిపండులా తయారయ్యాడని బొత్సపై విమర్శలు చేశారు.

"30 ఏళ్లు పీసీసీలో చేశావు. నీకేం ఖర్మ ఇది బొత్స సత్యనారాయణా! క్యాబినెట్ లో నీకేమైనా విలువ ఉందా? వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో పనిచేశావు. ఇప్పుడేమో చేతులు కట్టుకుని తిట్లు తింటున్నావు. మొన్నేమో ఎన్డీయేలో చేరుతున్నట్టు చెప్పమంటే చెప్పావు. ఇవాళేమో నేనెప్పుడు అన్నాను అంటూ మాట మార్చావు. మీరేం మాట్లాడుతున్నారో, మీరేం చెబుతున్నారో!

అయినా మీకు, నాకు ఇంగ్లీషు ఎందుకు చెప్పండి బొత్స సత్యనారాయణ గారు! ఎక్స్ పర్సనల్ సెక్రటరీ అంటున్నావు, ప్రామినెంట్ పర్సన్ అంటున్నావు. మనకెందుకు బొత్సా ఇంగ్లీషు. కేంబ్రిడ్జిలో, ఆక్స్ ఫర్డ్ లో చదివిన జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఈ మధ్య తెలుగులో మాట్లాడడంలేదు. విజయవాడలో హిందూ దినపత్రిక వాళ్లతో అమరావతి గురించి ఇంగ్లీషులోనే మాట్లాడారు. ఎన్డీయేలో చేరడం అనేది జగన్ మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా. ఇదంతా మనకెందుకు బొత్స గారూ అంటూ తనదైన శైలిలో ప్రసంగించారు.