ట్రంప్ మూడు గంటల పర్యటనకు రూ.100 కోట్లు ఖర్చు

16-02-2020 Sun 15:30
  • ఈ నెల 24న భారత పర్యటనకు వస్తున్న ట్రంప్
  • అహ్మదాబాద్ లో మోదీ కలిసి ప్రసంగం
  • కోట్లు కుమ్మరిస్తున్న ప్రభుత్వం
Three hour visit of Trump costs 100 crore rupees

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24న భారత్ రానున్నారు. ట్రంప్ రెండ్రోజుల పర్యటన కోసం భారత్ లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పట్లో మోదీ అమెరికాలో పర్యటించిన సమయంలో హౌడీ మోదీ అనే కార్యక్రమం ద్వారా అక్కడి భారత సంతతి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ట్రంప్ కూడా కెమ్ చో ట్రంప్ అనే కార్యక్రమం ద్వారా భారతీయులను ఆకట్టుకోవాలని నిర్ణయించారు. భారత పర్యటనలో భాగంగా ట్రంప్ గుజరాత్ లోని అహ్మదాబాద్ రానున్నారు. అక్కడ ప్రధాని మోదీ కలిసి కెమ్ చో ట్రంప్ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ కార్యక్రమం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం శరవేగంగా నిర్మాణపనులు జరుపుకుంటోంది. అహ్మదాబాద్ మొతేరాలోని ఈ స్టేడియాన్ని ట్రంప్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ట్రంప్ మూడు గంటల పాటు అహ్మదాబాద్ లో ఉంటారు. అందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు యుద్ధప్రాతిపదికన కొత్త రోడ్లు, పాత రోడ్ల ఆధునికీకరణ చేపట్టారు. ట్రంప్ భద్రత కోసమే రూ.15 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ట్రంప్ హాజరయ్యే రోడ్ షో కోసం 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.