జనసేనతో తప్ప మాకెవరితోనూ పొత్తు లేదు: పురందేశ్వరి

16-02-2020 Sun 14:53
  • వైసీపీతో బీజేపీ పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్న పురందేశ్వరి
  • ఏపీలో జనసేనతో మాత్రమే కలిసి పనిచేస్తామని స్పష్టీకరణ
  • జగన్ వి ఒంటెద్దు పోకడలు అంటూ విమర్శలు
Purandeswari says BJP allied only with Janasena in AP

బీజేపీ నేత పురందేశ్వరి ఏపీ తాజా పరిణామాలపై స్పందించారు. బీజేపీతో వైసీపీ పొత్తు అంటూ జరుగుతున్న ప్రచారం గురించి మాట్లాడుతూ, అది అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. వైసీపీతో బీజేపీ పొత్తు లేదని స్పష్టం చేశారు. ఏపీలో జనసేన పార్టీతో తప్ప తమకు మరే ఇతర పార్టీతోనూ పొత్తు లేదని, రాష్ట్రంలో తాము జనసేనతోనే కలిసి పనిచేస్తామని చెప్పారు.

జగన్ వి ఒంటెద్దు పోకడలని, శాసనమండలి రద్దు భావ్యం కాదని పురందేశ్వరి విమర్శించారు. పీపీఏల రద్దు నుంచి రాజధాని మార్పు నిర్ణయం వరకు జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా సరైన పాత్ర పోషించడంలేదని ఆమె విమర్శించారు..