మేము ఏం చేయలేదంటే ఎలా? ముందుంది ముసళ్ల పండగ: టీడీపీపై అంబటి వ్యాఖ్యలు

16-02-2020 Sun 14:35
  • బాబు మాజీ పీఎస్ పై ఐటీ దాడుల ఘటనపై అంబటి స్పందన
  • టీడీపీపై ఆరోపణలు చేయాల్సిన అవసరం మాకు లేదు
  • ఐటీ ప్రెస్ నోట్ లో ఉన్నదే మేము చెబుతున్నాం
Ambati Rambabu warns TDP

చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ నివాసంలో ఇటీవల జరిగిన ఐటీ దాడుల ఘటన నేపథ్యంలో టీడీపీపై వైసీపీ నాయకులు విమర్శలు, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ, టీడీపీపై ఆరోపణలు చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. పెండ్యాల శ్రీనివాస్ ఇచ్చిన సమాచారం మేరకు ఏకకాలంలో కడపలో టీడీపీకి చెందిన శ్రీనివాసులు రెడ్డి ఇంటిలో , ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబసభ్యుల ఇళ్లలో, లోకేశ్ సన్నిహితుల నివాసాల్లో  ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారని అన్నారు.

ఓ ప్రముఖ వ్యక్తి మాజీ పీఎస్ నివాసంలో దాడులు జరిపామని, నేరారోపణ చేయడానికి ఆధారాలతో కూడిన అనేక అంశాలను సీజ్ చేశామని, సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు అక్రమంగా లావాదేవీలు జరిగాయన్న విషయాన్ని ఐటీ శాఖ ప్రకటనలో ఉందని, ఆ విషయాన్నే తాము చెబుతున్నామని అన్నారు. ‘మేము ఏం చేయలేదంటే ఏమవుతుంది? ముందుంది ముసళ్ల పండగ’ అని టీడీపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.