'ప్రేమన్నాడు, పెళ్లన్నాడు, పారిపోయాడు'.. ప్రేమికుడి ఇంటి ముందు అమ్మాయి ధర్నా

16-02-2020 Sun 12:48
  • తిరుపతిలో ఘటన
  • బెంగళూరుకు పారిపోయిన ప్రేమికుడు
  • మహిళా సంఘాలను ఆశ్రయించిన యువతి
  • పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన
girl protest at lover home

ప్రేమన్నాడు.. పెళ్లన్నాడు.. చివరకు మోసం చేసి ప్రియురాలికి కనపడకుండా పోయాడు. దీంతో ప్రియుడి ఇంటి ముందు ఆ అమ్మాయి ధర్నాకు దిగింది. ఈ ఘటన తిరుపతిలోని కొర్లగుంటలోని నవోదయ నగర్‌లో చోటు చేసుకుంది.  

తిరుపతి రూరల్‌ అవిలాలకు చెందిన ఓ అమ్మాయికి కాలేజీలో కొర్లగుంటకు చెందిన చంద్రమౌళి అనే యువకుడు పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారింది. చివరకు వారిద్దరు అమ్మాయి కుటుంబ సభ్యుల కంట పడడంతో ఇరువురికి పెళ్లి చేయాలని భావించి, చంద్రమౌళి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అడిగారు. అయితే, వారు ఒప్పుకోకపోవడంతో బాధిత యువతి తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

దీంతో భయపడిపోయిన యువకుడు, అతడి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి సముఖత వ్యక్తం చేశారు. అయితే, ఈ సమయంలో చంద్రమౌళిని గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరుకు పంపారు. దీంతో  మహిళా సంఘాలతో కలసి బాధిత అమ్మాయి ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేస్తోంది.