Guntur District: పోలీసులనే బురిడీ కొట్టించిన కేటుగాడు... రూ. కోటికి పైగా నష్టపోయిన గుంటూరు పోలీసులు!

  • మంచి పోస్టింగ్స్ ఇప్పిస్తామని మోసం
  • భాధితుల్లో సీఐలు, ఎస్ఐలు
  • అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సైబర్ విభాగం
Police Cheated by youth in Guntur district

గుంటూరు జిల్లాకు చెందిన ఎంతో మంది పోలీసులు, ఓ కేటుగాడి మాయమాటలకు పడిపోయి, దాదాపు కోటి రూపాయలు నష్టపోయారు. వీఆర్ లో ఉన్న వాళ్లకు పోస్టింగ్ లు ఇప్పిస్తానని, మంచి రాబడి వచ్చే స్టేషన్లకు బదిలీ చేయిస్తానని, సస్పెన్షన్ ఎత్తి వేయిస్తానని చెబుతూ, వారిని నమ్మించిన ఓ యువకుడు, వారి నుంచి లక్షలాది రూపాయల డబ్బులు వసూలు చేశాడు. జిల్లాకు చెందిన ఎంతో మంది ఇతని మాయలో పడి నష్టపోగా, విషయాన్ని గమనించిన సైబర్ పోలీసులు, అతన్ని రహస్యంగా అదుపులోకి తీసుకుని విచారించి, సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చినట్టు తెలుస్తోంది.

ఇక ఆ యువకుడికి పోలీసు శాఖలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని, అతని సెల్ ఫోన్ లో వారి చిత్రాలు, ఫోన్ నంబర్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. పొన్నూరు మండలానికి చెందిన అతనికి గుంటూరు జిల్లాలోని పొలిటికల్  లీడర్లతోనూ పరిచయాలు ఉన్నాయని తేల్చారు. వీఆర్ లో ఉన్న ఇద్దరు ఇనస్పెక్టర్లు, ఓ ఎస్ఐ, పది మందికి పైగా కానిస్టేబుళ్లు ఇతనికి డబ్బిచ్చినట్టు గుర్తించారు. ఓ యువకుడికి పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 10 లక్షలు గుంజాడు. ప్రస్తుతం అతను హోంగార్డుగా పనిచేస్తున్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులు అతన్నుంచి ఈ మోసాల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకున్నారు.

ఇక పల్నాడు ప్రాంతానికి చెందిన ఎస్ఐలను మంచి పోస్టింగ్స్ ఇప్పిస్తానని చెప్పి కూడా ఇతను మోసం చేసినట్టు అధికారుల విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది.  ఇక అతను నోరు తెరిస్తే, తమ గతి ఏమవుతుందోనని అతనికి పరిచయం ఉన్న ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News