కష్టపడి కొన్న స్థిరాస్తులను అమ్మేసుకుని... ఇప్పుడు బాధ పడుతున్న అనుష్క!

16-02-2020 Sun 06:56
  • చానాళ్ల క్రితం హైదరాబాద్ లో ఫ్లాట్ కొన్న అనుష్క
  • ధర పడిపోతుందన్న భయంతో విక్రయం
  • ఆపై మూడు రెట్లు పెరిగిన ధర
Anushka Sell her Flat which is a high value now

చేతిలో నాలుగు రూపాయలు ఉంటే, ఎవరైనా దాన్ని ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టాలని భావిస్తారు. ఆస్తి విలువ పెరగాలంటే, ఆ పెట్టుబడి స్థిరాస్తి రూపంలో ఉంటే మంచిదని అత్యధికులు నమ్ముతుంటారు. అందుకే ఎక్కడి భూమి విలువైనా పెరుగుతూ ఉంటుంది కానీ ఒక్కసారిగా పడిపోదు. ఇదే విషయాన్ని తొలుత వంట బట్టించుకున్న స్టార్ హీరోయిన్ అనుష్క, ఆ తరువాత మాత్రం తొందరపడి తప్పు చేశానని ఇప్పుడు వాపోతోంది.

ఇంతకీ ఏమైందంటే, సినిమాల్లో బ్రహ్మాండంగా సంపాదిస్తున్న సమయంలో అనుష్క, హైదరాబాద్ లోని ఓ పోష్‌ లొకాలిటీలో ఖరీదైన ఫ్లాటు కొంది. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమైన తరువాత, ప్రత్యేక రాష్ట్రం వస్తే, భూముల ధరలు పడిపోతాయేమో అన్న భయంతో దాన్ని రూ. 5 కోట్లకు అమ్మేసిందట. అనుష్క తన మనసులో అనుకున్నట్టుగా ఫ్లాట్ ధర పడిపోకపోగా, ఇప్పుడు దాని ధర రూ. 15 కోట్ల వరకూ పెరిగిందట.

ఇక ఇదే సమయంలో విశాఖపట్నంలోనూ అనుష్క ఇదే తరహాలో పప్పులో కాలేసింది. అప్పుడెప్పుడో విశాఖలో భూములను కొనుగోలు చేసిన అనుష్క, చంద్రబాబు సీఎం అయిన తరువాత, అమరావతి అభివృద్ధి చెందుతుందని, విశాఖలో భూముల ధరలు పెద్దగా పెరగబోవని అనుకుంటూ వాటిని కూడా విక్రయించింది. ఇప్పుడు మాత్రం తాను తొందరపడ్డానని బాధపడుతోందట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, అనుష్క సినిమాల విషయంలోనూ ఇలాగే ప్రయోగాలు చేసి తొందర పడి నష్టపోయిందని జాలి చూపుతున్నారు.