Toyota: టొయోటా సరికొత్త వాహనం... వెల్ ఫైర్!

  • ఎంపీవీ సెగ్మెంట్లో మరో వాహనం
  • ఈ నెల 26న భారత మార్కెట్లోకి రాక
  • మెర్సిడెస్ బెంజ్ వీ క్లాస్ కారుకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం
Toyota to launch Vellfire

మల్టీ పర్పస్ వెహికిల్ (ఎంపీవీ) సెగ్మెంట్లో మరో కొత్త కారు వస్తోంది. జపాన్ కార్ల తయారీ దిగ్గజం టొయోటా భారత మార్కెట్లోకి వెల్ ఫైర్ ను ప్రవేశపెడుతోంది. ఎంపీవీ సెగ్మెంట్లో ఇది మరింత పోటీకి తెరలేపనుంది. ఫిబ్రవరి 26న వెల్ ఫైర్ మార్కెట్లోకి రానుంది. సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ తో పనిచేసే ఈ కారు ఎంతో విశాలంగా ఉంటుంది. ప్రీమియం తరహా సీటింగ్, ఎలక్ట్రానిక్ ఫుట్ రెస్ట్స్, హీటెడ్ వెంటిలేషన్ సీట్లు ఏర్పాటు చేశారు. మధ్య వరుసలోని సీట్లను వెనక్కి మరల్చే వెసులుబాటు ఉంది.

సేఫ్టీ పరంగానూ ఇందులో నాణ్యతకు పెద్దపీట వేశారు. మల్టిఫుల్ ఎయిర్ బ్యాగులు, రియర్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ యూనిట్, హిల్ హోల్డ్ అసిస్టెన్స్ వంటి సౌకర్యాలు పొందుపరిచారు. కాగా, భారత మార్కెట్లో ఎంపీవీ సెగ్మెంట్లో ప్రధానంగా టొయోటా ఇన్నోవా క్రిస్టా మార్కెట్ లీడర్ గా కొనసాగుతోంది. అప్పర్ ప్రీమియం సెగ్మెంట్లో మెర్సిడెస్ బెంజ్ వీ క్లాస్ కు వెల్ ఫైర్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక, ధర విషయానికొస్తే రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

More Telugu News