Siddaramaih: పోలీసుల అదుపులో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేతలు

  • విద్యార్థులు, పేరెంట్స్, టీచర్లపై దేశ ద్రోహం కేసు నమోదుపై నిరసనలు
  • సీఎం యడ్యూరప్ప నివాసానికి ర్యాలీ
  • శాంతి భద్రతల సమస్య వస్తోందని అదుపులోకి తీసుకున్నామన్న పోలీసులు
Siddaramaih other Congress leaders Detained

కర్ణాటక, బీదర్ లోని శాహిన్ పాఠశాలలో ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా విద్యార్థులు నాటకాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులపై దేశద్రోహం నేరం కింద కేసు నమోదు చేయడంతో, కాంగ్రెస్ నేతలు  బెంగళూరులో నిరసనలు చేపట్టారు. ఈ రోజు సీఎం యడ్యూరప్ప నివాసం వరకు ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య, పార్టీ నేతలు దినేశ్ గుండూరావు, రిజ్వాన్ అర్షద్, కె.సురేశ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ర్యాలీలో పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనడంతో..శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధ రామయ్య మాట్లాడుతూ.. ఓ విద్యార్థిని తల్లిని అరెస్టు చేసి, తల్లీ,పిల్లలను వేరుచేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నారు.

ఇదిలావుండగా, దేశద్రోహం కేసుపై విచారణ చేపట్టిన జిల్లా న్యాయస్థానం పోలీసుల చర్యను తప్పుబట్టడమేకాక, వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, హోం శాఖకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గత రెండు రోజులుగా జైల్లో ఉన్న విద్యార్థిని తల్లి అనుజా మిన్సా, టీచర్ ఫరీదా బేగానికి బీదర్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

More Telugu News