Pawan Kalyan: బీజేపీ, వైసీపీ పొత్తు పెట్టుకుంటే అందులో నేనుండను: పవన్ కల్యాణ్

  • రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన
  • మందడంలో రైతులు, మహిళలను ఉద్దేశించి ప్రసంగం
  • తాను ఓట్ల కోసం రాలేదని వెల్లడి
  • పొత్తు అంటూ వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యలు
Pawan responds on YSRCP and BJP alliance speculations

జనసేనాని పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందడంలో రైతులు, మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను ఓట్ల కోసం రాలేదని, తనకు అధికారం కూడా లేదని అన్నారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉన్నారో, లేదో తెలియదని రాపాక వరప్రసాద్ ను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానించారు. తాను ప్రతిరోజు వార్తల్లో కనిపించే వ్యక్తిని కానని, మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం లేనిపోని వార్తలు సృష్టించనని, ఉన్న సమస్యను ధాటిగా వినిపిస్తానని స్పష్టం చేశారు.

జగన్ మాటలు వింటుంటే ఇప్పుడే పుట్టిన పసిబిడ్డను తలపిస్తున్నాడని విమర్శించారు. రాజధానికి నిధులు అడిగామని జగన్ చెబుతున్నారని, ఆయన నిధులు అడిగింది ఏ రాజధానికో చెప్పాలని నిలదీశారు. జనసేన, బీజేపీ ఏపీ రాజధాని అమరావతి వైపే మొగ్గుచూపుతున్నాయని స్పష్టం చేశారు. మూడు రాజధానుల అంశం ఆమోదయోగ్యం కాదని కేంద్రం పెద్దలు స్పష్టం చేశారని పవన్ వివరించారు. ఇప్పుడు వైసీపీ, బీజేపీ పొత్తు అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, అవన్నీ అబద్ధాలేనని అన్నారు. ఒకవేళ వైసీపీ, బీజేపీ పొత్తు కుదుర్చుకుంటే అందులో తాను ఉండబోనని పవన్ తేల్చి చెప్పారు.

More Telugu News