ప్రియురాలి భర్తను హత్య చేసి జైలుకు... ఎంబీబీఎస్ పూర్తిచేసి ఇప్పుడు వైద్యవృత్తిలోకి!

15-02-2020 Sat 18:02
  • వైద్యుడు కావాలని భావించిన సుభాష్ పాటిల్
  • అక్రమ సంబంధంతో అగాధంలోకి పయనం
  • 14 ఏళ్ల జైలుశిక్ష తర్వాత మళ్లీ ఎంబీబీఎస్ కోర్సులో చేరిన వైనం
Karnataka man completes MBBS after 14 years jail term

పరిస్థితులు మనిషిని ఎలా పెడదారి పట్టిస్తాయో చెప్పేందుకు, జీవితాశయం కోసం ఓ వ్యక్తి పట్టుదల గురించి చెప్పేందుకు కర్ణాటకకు చెందిన సుభాష్ పాటిల్ ఉదంతమే నిదర్శనం. కర్ణాటకలోని కాలబుర్గి ప్రాంతానికి చెందిన సుభాష్ పాటిల్ డాక్టర్ కావాలని కలలు కన్నాడు. అనుకున్నట్టుగా వైద్య విద్యలో సీటు సంపాదించాడు. 1997లో ఎంబీబీఎస్ లో చేరాడు. ఆ సమయంలో పద్మావతి అనే వివాహితతో సుభాష్ కు అక్రమసంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన పద్మావతి భర్త ఇద్దరినీ హెచ్చరించాడు. దాంతో, అతడి అడ్డుతొలగించుకోవాలని పద్మావతి, సుభాష్ నిర్ణయించుకుని, అతడ్ని హత్య చేశారు.

ఈ కేసులో న్యాయస్థానం సుభాష్ కు జీవితఖైదు విధించింది. దాంతో, సుభాష్ డాక్టర్ కావాలన్న కలలు కల్లలయ్యాయి. 2002 నుంచి జైలుశిక్ష అనుభవించిన సుభాష్ 2016లో విడుదల అయ్యాడు. జైలు జీవితం అతడిలో పరివర్తన తీసుకువచ్చింది. తిరిగి సమాజంలో అడుగుపెట్టిన తర్వాత తన ఆశయానికి ప్రాణం పోశాడు. ఎంబీబీఎస్ కోర్సు పూర్తిచేయాలని నిర్ణయించుకుని యూనివర్శిటీని ఆశ్రయించాడు.

దీనిపై వర్సిటీ వర్గాలు న్యాయసలహా తీసుకున్నాయి. ఎందుకంటే సుభాష్ ఓ హత్యకేసులో జైలుశిక్ష అనుభవించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మళ్లీ కోర్సులో చేర్చుకోవచ్చా? అన్నది సదరు వర్సిటీ సందేహం. అయితే అతన్ని చేర్చుకోవచ్చంటూ న్యాయనిపుణులు స్పష్టం చేయడంతో సుభాష్ ఎంబీబీఎస్ కు మార్గం సుగమం అయింది. దాంతో రెట్టించిన పట్టుదలతో పుస్తకాలతో కుస్తీపట్టిన సుభాష్ గతేడాది ఎంబీబీఎస్ పూర్తిచేయడమే కాదు, ఇటీవలే ఇంటర్న్ షిప్ కూడా విజయవంతంగా ముగించుకుని రోగులకు సేవలు అందించేందుకు తహతహలాడుతున్నాడు.