Kambala Race Runner: ఉసేన్ బోల్ట్ ను మరపించిన శ్రీనివాస్ గౌడకు ప్రశంసల వెల్లువ!

  • ఒలింపియన్ ఉసేన్ బోల్ట్ ను మైమరిపించే పరుగు
  • ‘సాయ్’ ఆధ్వర్యంలో కోచింగ్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం
  • శిక్షణ కేంద్రానికి చేరుకోవడానికి రైల్వే టికెట్ ఏర్పాటు
 Kambala Race Runner Srinivas gowda Amazing Feet hundred meters Run Just below Ten Seconds

కంబాలా (జోడెద్దులతో కలిసి పాల్గొనే) రేసులో జాకీగా పాల్గొనే క్రీడాకారుడు శ్రీనివాస్ గౌడ అపూర్వ ప్రతిభను చాటాడు. ఒలింపిక్స్ లో తిరుగులేని స్ప్రింటర్ గా వెలుగొందిన ఉసేన్ బోల్ట్ ను మైమరపిస్తూ పరుగెత్తి శ్రీనివాస్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.  శ్రీనివాస్ ప్రతిభను కేంద్ర క్రీడల శాఖ గుర్తించింది. అతనికి తగిన కోచింగ్ ఇస్తే ఉసేన్ బోల్ట్ ను మించిపోతాడని ప్రశంసించింది.

శ్రీనివాస్ ప్రతిభపై బీజేపీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ 100 మీటర్లను కేవలం 9.55 సెకన్లలో అధిగమించాడు. అద్భుతం ఈ పరుగు. తగిన శిక్షణ కల్పిస్తే శ్రీనివాస్ గౌడ తప్పకుండా దేశం పేరును నిలబెడతాడు’ అని పేర్కొన్నారు.

దీనికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరన్ రిజిజు ట్విట్టర్ వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘అవును మురళీధర్ రావుజీ, సాయ్(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులు శ్రీనివాస్ ను కలిశారు. సోమవారానికల్లా సాయ్ కేంద్రానికి చేరుకునేలా అతనికి రైలు టికెట్ ను అరేంజ్ చేశారు. శ్రీనివాస్ కు మంచి కోచ్ తో శిక్షణ ఇప్పిస్తానని హామీ ఇస్తున్నా. మనం నరేంద్ర మోదీ టీంలో సభ్యులం. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించడానికి అన్ని ప్రయత్నాలు చేద్దాము’ అంటూ వ్యాఖ్యానించారు.

కర్ణాటకలోని మంగళూరు పట్టణంలోని ముదబిద్రి ప్రాంతానికి చెందినవాడు శ్రీనివాస్ గౌడ. నిర్మాణరంగంలో కూలి పనులు చేసుకునే శ్రీనివాస్ గౌడ ఈ నెల 1న కంబాలా రేసులో 142 మీటర్ల రేసును 13.42 సెకన్లలో పరుగెత్తి రికార్డు సృష్టించాడు. ఈ క్రీడ బురద నీళ్లున్న పొలం మడులలో జరుగుతుంది. రెండు ఎద్దులతో కలిసి జాకీగా శ్రీనివాస్ గౌడ ఈ పోటీలో పాల్గొన్నాడు. కాగా, సామాజిక మాధ్యమాల్లో ఇతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News