కేన్సర్ వ్యాధి కంటే ముందు దాని పట్ల ఉన్న భయమే మనల్ని చంపేస్తుంది: బాలకృష్ణ

15-02-2020 Sat 14:46
  • బసవతారకం ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ చైల్డ్ హుడ్ కేన్సర్ డే కార్యక్రమం
  • హాజరైన బాలకృష్ణ, రష్మిక
  • బాలలకు కేన్సర్ రావడం బాధాకరమన్న బాలయ్య
Balakrishna attends International Childhood Cancer Day program

హైదరాబాదులోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ చైల్డ్ హుడ్ కేన్సర్ డే కార్యక్రమం నిర్వహించారు. మేనేజింగ్ ట్రస్టీ, చైర్మన్ హోదాలో నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేన్సర్ వ్యాధి కంటే ముందు దానిపై మనలో ఉన్న భయమే మనిషిని కబళించి వేస్తుందని అన్నారు. భగవత్ స్వరూపులుగా భావించే చిన్నారులు కూడా కేన్సర్ బారినపడడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

దేశానికి యువతే బలం అని, యువతీయువకులు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. కేన్సర్ వ్యాధి బాధితులందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనేది తన తల్లి బసవతారకం కోరిక అని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటి రష్మిక మందన్న కూడా హాజరయ్యారు. అంతేకాదు, కేన్సర్ ను జయించిన పలువురు బాలలు, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.