పెను ప్రమాదం నుంచి బయటపడ్డ జగన్ బావ.. బ్రదర్ అనిల్ కుమార్

15-02-2020 Sat 12:29
  • జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం
  • డివైడర్ పై నుంచి దూసుకెళ్లిన కారు
  • హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా యాక్సిడెంట్
Brother Anil Kumar Escapes from Major Accident

ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు పెను ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ పై నుంచి దూసుకెళ్లి, రోడ్డు పక్కన ఉన్న వాలు ప్రదేశంలోకి చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే, పెను ప్రమాదం నుంచి అనిల్ కుమార్ సురక్షితంగా బయటపడ్డారు.  ఆయన డ్రైవర్, గన్ మెన్లకు గాయాలయ్యాయి.

విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్నారు. అనిల్ కుమార్ తో పాటు గాయపడ్డ డ్రైవర్, గన్ మెన్ ను తన కారులో విజయవాడలోని ఎంజే నాయుడు ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత తన పర్యటనకు అనిల్ వెళ్లిపోయారు. జాతీయ రహదారిపై వేగాన్ని నియంత్రించేందుకు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్లను తప్పించబోయే ప్రయత్నం చేసిన సందర్భంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.