Chiranjeevi: వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరనున్న చిరంజీవి... రాజ్యసభ సీటు కూడా... ఎన్టీవీ ప్రత్యేక కథనం!

  • గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి
  • జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి అనూహ్య మద్దతు
  • చిరంజీవి వైసీపీలో చేరడం ఖాయమంటున్న అనుచరులు
Chiranjeevi to Join YSRCP

ప్రజారాజ్యం పార్టీని పెట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని పొందడంలో విఫలమై, ఆ తరువాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా? ఆయనకు రాజ్యసభ సీటును ఇచ్చేందుకు జగన్ అంగీకరించారా? అవునని అంటూ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ 'ఎన్టీవీ' ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులను అనుభవించిన చిరంజీవి గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండి, సినిమాలపై దృష్టిని సారించారు.

కేంద్రంలో, బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత, ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. కొంతకాలం క్రితం ఏపీ సీఎం జగన్ తో భేటీ తరువాత, చిరంజీవి వైసీపీలో చేరాలని భావిస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే, తాను నటించిన 'సైరా' చిత్రాన్ని చూడాలని కోరడానికే జగన్ ను చిరంజీవి కలిశారన్న వివరణ వచ్చింది.

ఇదిలావుండగా, వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను చేసిన తరువాత, అనూహ్యంగా చిరంజీవి దానికి మద్దతు పలికారు. మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం ముందడుగు వేస్తుందని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వైసీపీలో చేరుతారన్న వార్తలకు బలం చేకూరింది. అతి త్వరలో ఇందుకు ముహూర్తం కుదురుతుందని, జగన్ తో చిరంజీవి చేతులు కలిపేది ఖాయమని ఆయన అనుయాయులు చెబుతున్నట్టు ఎన్టీవీ పేర్కొంది. ఎన్టీవీ ప్రసారం చేసిన ప్రత్యేక కథనాన్ని మీరూ చూడవచ్చు.

More Telugu News