Murder: చాయ్ తాగేందుకు వెళ్లడంతో బతికిపోయాడు... భార్య, కుమార్తె దారుణ హత్య!

  • హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఘటన
  • పోలీసుల విచారణలో పలు వాస్తవాలు వెలుగులోకి
  • మాంసం కత్తితో ఇద్దరి హత్య
Twin Murders In old City of Hyderabad

ఓ వ్యక్తి ఉదయాన్నే టీ తాగేందుకు వెళ్లి వచ్చేంతలో అతని భార్య, కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. చాయ్ తాగేందుకు వెళ్లడంతోనే అతని ప్రాణాలు మిగిలాయి. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, చాంద్రాయణ గుట్టలోని తాళ్లకుంటలో మహ్మద్ హుస్సేన్ నివాసం ఉంటున్నాడు. నిన్న హుస్సేన్ తెల్లారగానే చాయ్ తాగేందుకు వెళ్లాడు. ఆ తర్వాత తన ఇంటి సమీపంలోనే ఓ షాపులో కూర్చున్నాడు. ఇంతలో ఆ వీధిలోకి పోలీసు వాహనాలు వెళుతూ కనిపించాయి.

దీంతో అతను వెళ్లి పోలీసులను విషయం ఏంటని ప్రశ్నించగా, 'ఆ ఇంట్లో తల్లీ కూతుళ్లు హత్యకు గురయ్యారని' తన ఇంటివైపు చూపించడంతో హుస్సేన్ కుప్పకూలాడు. కాగా, మహ్మద్ హుస్సేన్ భార్య షహజాదీ బేగం, కుమార్తె ఫరీదాబేగం విగత జీవులుగా కనిపించడంతో, ఆ ప్రాంతంలో కలకలం రేగింది. పోలీసుల విచారణలో పలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఫరీదాకు (32) పదహారేళ్ల వయసున్నప్పుడే దుబాయ్ కి చెందిన అబ్దుల్ అలీతో పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలుండగా, భర్త కొంతకాలం క్రితం చనిపోయాడు. దీంతో ఫరీదా తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఆపై బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంది. ఉద్యోగం నిమిత్తం సౌదీకి వెళ్లి, గుల్బర్గా ప్రాంతానికి చెందిన మహతాబ్ ఖురీషీ అనే యువకుడిని వివాహమాడింది. వారికి ఓ కుమార్తె జన్మించగా, ఇద్దరి మధ్యా జరిగిన గొడవల కారణంగా ఖురేషీ జైలుకు వెళ్లాడు. దీంతో ఫరీదా మరోసారి స్వదేశానికి వచ్చి, అప్పుడప్పుడూ భర్తతో మాట్లాడేది.

అయితే, ఫరీదాను పెళ్లి చేసుకోవడానికి ముందే ఖురేషీకి ముంబైలో మరో భార్య ఉంది. ఆమెతో గొడవ తరువాత జరీనా అనే బండ్లగూడకు చెందిన యువతిని మూడో వివాహం చేసుకున్నాడు. ఇదిలావుంచితే, ఖురేషి తమ్ముడు అబ్దుల్ రెహమాన్, ఓల్డ్ సిటీలో ఏదైనా ఇల్లు కొనాలని తన వదిన ఫరీదాకు డబ్బు పంపడంతో ఈ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. రహమాన్ పంపిన డబ్బుతో ఫరీదా తన తల్లి పేరిట ఓ మూడంతస్తుల ఇల్లు కొనగా, ఆ ఇల్లు ఇప్పుడు ఇంత గొడవకు కేంద్రమైంది.

ఎంతగా అడిగినా ఇల్లు తన పేరుకు బదలాయించకపోవడంతో కోపం పెంచుకున్న రహమాన్, తన వదినను, ఆమె తల్లిని దారుణంగా చంపేశాడు. ఇక పోలీసుల నుంచి విషయం తెలుసుకున్న హుస్సేన్, ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు వాళ్లకు ఇచ్చేయమని సూచించినా, కూతురు తన మాట వినలేదని, తన మనవడు నెలకు రూ. 60 వేల వరకూ సర్దుతున్నా సరిపెట్టుకోలేదని అన్నారు.

కాగా, ఫరీదా కుమార్తెలు ఇద్దరూ హత్య జరిగిన సమయానికి స్కూల్ కు వెళ్లారని, లేకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు తెలిపారు. మాంసం కోసే కత్తితో నిందితుడు ఈ హత్యలను చేశాడని తమ దర్యాఫ్తులో వెల్లడైందని పోలీసులు వెల్లడించారు.

More Telugu News