Karnataka: పరుగో పరుగు... ఉసెన్ బోల్ట్ రికార్డును బద్దలుగొట్టిన కర్ణాటక యువకుడు!

  • 9.58 సెకన్లలో 100 మీటర్లు పరిగెత్తిన ఉసెస్ బోల్ట్
  • 9.55 సెకన్లలో అదే దూరాన్ని అధిగమించిన శ్రీనివాస గౌడ
  • కర్ణాటక కంబళ పోటీల్లో సరికొత్త రికార్డు
Kambala Record Run by Srinivasa Gouda

పరుగుల వీరుడు అంటే ఎవరికైనా గుర్తుకు వచ్చేది జమైకా చిరుత ఉసెన్ బోల్ట్ పేరే. కేవలం 9.58 సెకన్లలోనే 100 మీటర్ల దూరాన్ని పరుగెత్తి వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే, కన్నడనాట ఓ యువకుడు కేవలం 9.55 సెకన్లలోనే 100 మీటర్ల దూరం పరిగెత్తాడు. అది కూడా బురదలో. పశ్చిమ కర్ణాటకలో ఏటా 'కంబళ' పేరిట జరిగే సంప్రదాయ ఎద్దుల పరుగు పందేల పోటీలో శ్రీనివాస గౌడ అనే యువకుడు 142.50 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్లలో పరిగెత్తాడు. అతనికే తొలి బహుమతి లభించింది.

వేగం ప్రకారం చూస్తే, ఉసెస్ బోల్ట్ రికార్డు కన్నా 0.03 సెకన్లు తక్కువగా 9.55 సెకన్లలోనే శ్రీనివాస గౌడ 100 మీటర్లు పరిగెత్తినట్టు. ఇక ఈ పోటీల చిత్రాలు, వీడియోలు, శ్రీనివాస గౌడ రికార్డుపై స్థానిక దినపత్రికలు, కన్నడ టీవీ చానెల్స్ ప్రత్యేక వార్తలను ప్రచురించాయి. కంబళ చరిత్రలో ఇంత వేగంగా పరిగెత్తడం ఇదే తొలిసారని వెల్లడించాయి. దీంతో రాత్రికి రాత్రే సామాజిక మాధ్యమాల్లో అతను స్టార్ గా మారాడు. అఫీషియల్ కాదుగానీ, అదే అధికారిక పోటీలు అయితే, శ్రీనివాస గౌడ విశ్వ చిరుతగా నిలిచుండేవాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

More Telugu News