తిరుపతి-తిరుమల మధ్య ‘లైట్ మెట్రో’?

14-02-2020 Fri 20:42
  • టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డితో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి భేటీ
  • భక్తుల రద్దీని తగ్గించేందుకు రవాణా చర్యలపై చర్చ
  • రేణిగుంట విమానాశ్రయం- తిరుపతి వరకు సుందరీకరణ అంశంపైనా చర్చ 
Light Metro train between Tirupathi and Tirumala is planned

తిరుపతి నుంచి తిరుమల మార్గంలో ‘లైట్ మెట్రో’ రవాణా మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇవాళ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తిరుపతి నుంచి తిరుమల మార్గంలో భక్తుల రద్దీని తగ్గించేందుకు తీసుకోవాల్సిన రవాణా చర్యలపై వీరిద్దరు చర్చించినట్టు సమాచారం.

 తిరుపతి రైల్వేస్టేషన్,  బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా రవాణా మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే, రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి వరకు సుందరీకరణ పనుల అంశంపైనా మాట్లాడుకున్నారని సంబంధిత వర్గాల సమాచారం.