టీ-పీసీసీ రేసులో నేనూ వున్నా.. సీరియస్ గానే ప్రయత్నిస్తున్నా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

14-02-2020 Fri 20:20
  • పీసీసీ ఇంఛార్జీ కుంతియాను కలిశాను
  • ఈ పదవి నాకు ఇవ్వాలని కోరాను
  • ఈ నెలాఖరులోగా  సోనియా, రాహుల్ గాంధీలను కలుస్తా
MLA Jagga Reddy says he is also in race for PCC chief

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పలువురు ఇప్పటికే బరిలో ఉన్నారు. ఆ జాబితాలో కొత్తగా మరో నేత చేరారు. టీ-పీసీసీ రేసులో తానూ ఉన్నాననీ, సీరియస్ గానే ప్రయత్నిస్తున్నానంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ ఇంఛార్జీ కుంతియాను కలిశానని, తనకు ఈ పదవి ఇవ్వాలని కోరానని చెప్పారు. ఈ నెలాఖరులోగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను కలుస్తానని తెలిపారు.

 ‘ఎమోషనల్ పాలిటిక్స్’ ఇప్పుడు పనిచేయవని, ప్రజల నాడి మేరకు పనిచేయాల్సి ఉంటుందని, ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. డబ్బులు, అభివృద్ధి కోణంలోనే రాజకీయ వ్యూహం రచించాలని, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు, జూనియర్లు కలిసి పనిచేస్తేనే తమ పార్టీ అధికారంలోకి  రాగలుగుతుందని అభిప్రాయపడ్డారు.