నిప్పునని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు మౌనం పాటిస్తున్నారు?: వైసీపీ నేత ఉమ్మారెడ్డి

14-02-2020 Fri 18:10
  • మాజీ పీఎస్ నివాసంలో ఐటీ దాడులతో బాబుకు సంబంధం లేదా?
  • బాబు, లోకేశ్ ల ఆర్థిక లావాదేవీలపై యనమల వకాల్తా   
  • తనపై ఆరోపణలపై చంద్రబాబు స్పందించరే?
YSRCP leader Umareddy irony chandrababu who describes himself as FIRE why he is now silent

చంద్రబాబునాయుడు మాజీ పీఎస్ నివాసంలో ఐటీ దాడులతో బాబుకు ఎటువంటి సంబంధం లేదంటూ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేశ్ ల ఆర్థిక లావాదేవీల విషయంలో యనమల వకాల్తా తీసుకున్నారా? అని ప్రశ్నించారు.

చాలా సందర్భాల్లో తాను నిప్పునని చెప్పుకునే చంద్రబాబు తనపై ఆరోపణలు వస్తున్నా ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఆ నిప్పుకు ఇప్పుడు తుప్పు పట్టిందా? తేలు కుట్టిన దొంగలా ఉన్నారా? అన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని అన్నారు. తన మాజీ పీఎస్ డొల్ల కంపెనీలు నిర్వహించిన విషయం చంద్రబాబుకు తెలియదంటే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో తనకు సంబంధం లేకపోతే కనుక అదే విషయాన్ని చంద్రబాబు వెల్లడించాలని డిమాండ్ చేశారు.