ఆ డబ్బంతా చంద్రబాబు పీఎస్ వద్దే దొరికిందని అభాండాలు వేయడం మీకే చెల్లింది: వర్ల రామయ్య

14-02-2020 Fri 17:44
  • వైసీపీ నేతలు ప్రెస్ నోట్ పూర్తిగా చదవలేదని విమర్శలు
  • చెత్త సాక్షి అంటూ వ్యాఖ్యలు చేసిన వర్ల రామయ్య
  • చంద్రబాబును సాధించడం మానుకోవాలని హితవు
Varla Ramaiah gets anger over YSRCP leaders

ఐటీ దాడుల నేపథ్యంలో వైసీపీ నేతలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. 40 చోట్ల ఐటీ దాడులు చేసి, మొత్తం రూ.2 వేల కోట్ల విలువ చేసే డబ్బు లెక్క తేలాల్సి ఉందని ఐటీ విభాగం ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే, ఆ డబ్బంతా చంద్రబాబు పీఎస్ వద్దే దొరికిందని అభాండాలు వేయడం వైసీపీ వాళ్లకే చెల్లిందని వర్ల విమర్శించారు.

ఆ ప్రెస్ నోట్ పూర్తిగా చదవకుండా ఆ రూ.2 వేల కోట్లు చంద్రబాబు పీఎస్ వద్దే దొరికినట్టు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి విమర్శిస్తున్నారని, చెత్త సాక్షిలో రాతలు రాస్తున్నారని, ఇదంతా సూర్యుడిపై ఉమ్మేయడం వంటిదేనని ట్విట్టర్ లో స్పందించారు. దున్నపోతు ఈనిందంటే, దూడను గాటకు కట్టమన్నట్టుగా వైసీపీ మంత్రులు, శాసనసభ్యుల మానసిక స్థితి ఉందని ఎద్దేవా చేశారు.

మీరు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, అందరినీ ఆ గాటనే కట్టేయాలనుకోవడం మీ మానసిక దౌర్బల్యం కదా సార్? అంటూ సీఎం జగన్ పైనా ధ్వజమెత్తారు. 'ఇకనైనా చంద్రబాబును సాధించడం మానుకుని, ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లి విచారణకు సహకరించండి' అంటూ వర్ల రామయ్య హితవు పలికారు. చంద్రబాబుకు కూడా అవినీతి మరక అంటించేందుకు సీఎం ఎంతో దిగజారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.