Prakash Javadekar: కాంగ్రెస్ లేకనే ఢిల్లీలో బీజేపీ ఓటమి: కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్

  • కాంగ్రెస్ ఒక్కసారిగా మాయమైంది
  • దాంతో మా అంచనాలు తప్పి ఆప్ కు ఓట్ల శాతం కొంచెం పెరిగింది
  • బీజేపీకి 39 శాతం ఓట్లు వచ్చినా సీట్లు తగ్గాయని వెల్లడి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా మాయమైపోయిందని, అది బీజేపీ ఓటమికి కారణమైందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకపోవడంతో పోరాటం మొత్తం ఆప్, బీజేపీల మధ్యే కేంద్రీకృతమైందని చెప్పారు. నేడు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఒక్కసారిగా ఓట్లెలా తగ్గాయి?

కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల సమయంలో ఢిల్లీలో 26 శాతం ఓట్లు వచ్చాయని, అదే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లలో నాలుగు శాతం మాత్రమే వచ్చాయని చెప్పారు. ‘‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ పార్టీకి పడే ఓట్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. మరి కాంగ్రెస్ పార్టీ తనంతట తానే మాయమైపోయిందా? లేక ఎవరైనా అలా జరిగేలా చేశారా? లేక వాళ్ల ఓట్లన్నీ ఆప్ పార్టీకి ట్రాన్స్ ఫర్ అయ్యాయా? అన్నది మాత్రం తేలాలి..’’ అని జవదేకర్ పేర్కొన్నారు.

ఓట్ల శాతం మారిపోయింది

ఎన్నికల్లో ఆప్ కు 42 నుంచి 48 శాతం వరకు ఓట్లు వస్తాయని తాము అంచనా వేశామని జవదేకర్ చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా మాయమైపోవడంతో ఓట్ల శాతాల్లో తేడాలు వచ్చాయన్నారు. తాము అంచనా వేసినదానికంటే ఆప్ కు నాలుగైదు శాతం పెరిగాయని, బీజేపీకి 39 శాతం ఓట్లు వచ్చినా సీట్ల సంఖ్య తగ్గిందన్నారు. వీటన్నింటినీ బీజేపీ విశ్లేషించుకుంటోందని చెప్పారు.

More Telugu News